ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల 1వ తేదీ ఉదయం ఆరు గంటలకే పింఛన్ పంఫిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీ.వీరపాండియన్ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
ఆగస్టు 1వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేయాలని తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి విధి విధానాలు, ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు పంపించారు. మొదటి రోజే 99 శాతం పంపిణీ పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకున్నామని సాంకేతిక లోపం ఏదైనా వచ్చి పింఛన్ పంపిణీ ఆలస్యమైతే తర్వాత రోజు పూర్తి చేయాలన్నారు.
పింఛన్ పంపిణీలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరికాలు జారీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉండే పింఛన్ లబ్దిదారులంతా కూడా ఆగస్టు ఒకటో తేదీ నాటికి స్వగ్రామంలో అందుబాటులో ఉంటే మంచిదని అధికారులు సమాచారం పంపారు.