తిరుపతి, ప్రభన్యూస్ ప్రతినిధి: నెల్లూరు జిల్లా సోమశిల సమీపంలో 93ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం చేసుకుని, ఐదుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమశిల-అనంత సాగరం మార్గంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐలు సురేష్ బాబు, టి.విష్ణు వర్ధన్ కుమార్ బృందాలు తనిఖీలు నిర్వహించారు.
సోమశిల – అనంత సాగరం మార్గంలో ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితుల్లో నలుగురు తమిళనాడు తిరువన్నామలై జిల్లా, ఒకరు పాండిచ్చేరి వాసిగా గుర్తించారు. వారి నుంచి 93ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ సుబ్బరాయుడు రివార్డులు ప్రకటించారు.