సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. లభ్యమైన మృతదేహాలను లాక్షి, పింకీలుగా బంధువులు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందారు. మృతులు ఒడిశాలోని కోందుగూడ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఒడిశాలోని గుంటవాడ పంచాయతీ కోందుగూడా గ్రామానికి చెందిన కొందరు వలసకూలీలుగా తెలంగాణకు వెళ్లారు. అయితే, రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడలేక సోమవారం(మే 24) అర్ధరాత్రి సీలేరు రిజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై స్వగ్రామానికి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లిన వెంటనే రెండు పడవలు నీట మునిగాయి. మొదట బయలుదేరిన నాటు పడవ నది మధ్యలోకి వెళ్లేసరికి ముందు వెళ్తున్న నాటు పడవ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రెండో నాటుపడవలో ఉన్నవారు నదిలో పడినవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రెండో పడవ కూడా మునిగిపోయింది.
రెండు పడవల్లోని 11 మంది నదిలో మునిగారు. వారిలో ముగ్గురు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో 8 మంది గల్లంతయ్యారు. మంగళవారం(మే25) అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ఆరుగురి మృతదేహాలు దొరికాయి. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి బుధవారం(మే26) ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.