Tuesday, November 26, 2024

వాహన మిత్ర ద్వారా 7.64 లక్షల మందికి లబ్ధి, మూడేళ్లలో 764 కోట్ల వ్యయం: మంత్రి నాని

అమరావతి, ఆంధ్రప్రభ : వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 64 వేల 465 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అశోక్‌బాబు, పీవీఎన్‌ మాధవ్‌, అప్పిరెడ్డి, జయేంధ్ర భరత్‌, కళ్యాణి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ. 764 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. సొంత ఆటో, ట్యాక్సీ కలిగిన డ్రైవర్లకు ఈ పథకాన్ని వర్తింప చేశామని వెల్లడించారు. ఈ ఏడాది 2.86 లక్షల మందికి లబ్ధి చేకూరిందని తె లిపారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ సభ్యులు ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి, మరో చేత్తో ఆటో డ్రైవర్ల నుంచి ఫైన్‌ల రూపంలో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.

దీనిపై స్పందించిన మంత్రి గడిచిన మూడేళ్లలో ఫైన్‌లు, ట్యాక్స్‌ల ద్వారా వసూళ్లు చేసిన మొత్తాన్ని సభకు వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని దీనికి అనుగుణంగానే వారిని ఆదుకునేందుకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని వాహనాల ఫిట్‌మెం ట్‌, ట్యాక్స్‌లు కట్టుకునేందుకు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆటో పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని సభ్యులు చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. హోం మంత్రితో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement