Saturday, November 23, 2024

కొవిడ్ ఆస్పత్రులపై కొరడా… రూ. 1.25కోట్ల జరిమానా!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. కొవిడ్ నిబంధనలు పాటించని పలు ఆస్పత్రులపై చర్యలకు ఉపక్రమించారు. గుంటూరులో 52 కొవిడ్ ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝులిపించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై గుంటూరు జిల్లా అధికారులు భారీగా జరిమానా విధించారు. గుంటూరు జిల్లాలో 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ.1.25కోట్ల జరిమానా విధించారు.

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో రోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే అదనుగా భావించిన కొన్ని ఆస్పత్రులు బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వ నిబంధలను కూడా పట్టించుకోవడం లాంటివి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కవ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కొవిడ్ నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతోంది. ఇందులో 2,288 ఐసీయూ పడకలు, 12,250 ఆక్సిజన్‌ పడకలు, 11,544 సాధారణ పడకల్లో సేవలు అందుతున్నాయి. ఈ కేసులన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఇవి కాకుండా 200 తాత్కాలిక ఎం ప్యానల్డ్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనూ సేవలు అందిస్తున్నారు. 

ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ బాధితులకు పడకలు కేటాయించని ఆస్పత్రులు, చికిత్స అందించని ఆస్పత్రులపై అధికారులు తనిఖీలు నిర్వహించి ఇప్పటివరకూ 54 కేసులు నమోదు చేశారు. 11 ఆస్పత్రులను మూసి వేశారు. రూ.3.72 కోట్లు జరిమానా విధించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంత పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రి అయినా సరే ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న సమయంలో వ్యాపార దృక్పథంతో ఆస్పత్రులను నిర్వహించడం సమంజసం కాదని ఆరోగ్యశ్రీట్రస్ట్‌  సీఈవో మల్లికార్జున అన్నారు. తమ వంతు సాయంగా ప్రజలకు వైద్యం అందించేలా కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత్వంతో ఆలోచించాలని కోరారు. సామాన్యులు, పేదలకు భరోసా కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించిన ప్రతి ఆస్పత్రికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement