ఏపీలో ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. కొన్ని నెలల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయనగా.. నెల్లూరు జిల్లా గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. గూడూరు పరిసర ప్రాంతాలలో అనధికారికంగా వివిధ వాహనాల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల 12 లక్షల 91 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మద్యం, నగదు అక్రమంగా తరలించే అవకాశం ఉండడంతో టోల్‌ప్లాజాలు, శివారు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిపెట్టి పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి చెన్నైకి కొందరు వ్యక్తులు ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 5.12 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో నగదును సీజ్ చేసిన పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిల్లకూరు జాతీయ రహదారితో పాటు గూడూరు పట్టణం, గూడూరు రూరల్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.