Saturday, November 23, 2024

అమలాపురం ఘటనలో 46మంది అరెస్టు.. పరిస్థితి అదుపులోనే ఉందన్న ఏపీ డీజీపీ

అమరావతి, ఆంధ్రప్రభ : అమలాపురం విధ్వంస ఘటనకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో విధ్వంసం కేసులో కీలక పురోగతి లభించింది. ఘటనకు కారకులైన 46 మందిని గుర్తించి అరెస్టు చేశారు. మరో 72 మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి వెల్లడించారు. మరోవైపు జిల్లాలోని రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అమలాపురంలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులోనే ఉన్నట్లు ప్రకటించారు. ఈమేరకు బుధవారం ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి -టె-లీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు. కోనసీమలో తాజా పరిస్థితిని ఎస్పీలు డీజీపీకి వివరించారు. కాగా అమలాపురం అల్లర్ల ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు.

కలెక్టరేట్‌, మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు నిప్పు, 3 బస్సుల దహనంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే 46 మంది ఆందోళనకారులను అరెస్ట్‌ చేసినట్టు- డీజీపీ తెలిపారు. మరో 72 మంది అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, జిల్లాలో రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని డీజీపీ వెల్లడించారు. అమలాపురంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. అల్లర్లను అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామని, వాట్సాప్‌ గ్రూప్‌ల్లొ తప్పుడు ప్రచారంతోనే అల్లర్లు జరిగాయన్నారు. అమలాపురంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని, 3 బస్సుల దగ్ధంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement