ఓ డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారి పాలిట శాపంగా మారింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని స్కూల్ బస్సు రూపంలో మృతువ్యు కబలించింది. పాలచర్ల గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న బండి శ్రీవల్లి(4) అనే చిన్నారి మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో ఘటన చోటుచేసుకుంది.
స్కూల్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారి మధ్యాహ్నం భోజన సమయంలో మరో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆయా సహాయంతో మూత్ర విసర్జనకు బయటకు వచ్చింది. బాలిక వెంట వచ్చిన ఇద్దరు చిన్నారులు ముందుగా మూత్ర విసర్జన అనంతరం కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. వారికోసం ఆయా చిన్నారి శ్రీవల్లిని వదిలి ముందుకు వెళ్లింది.
ఈ క్రమంలోనే అటుగా అతివేగంగా వస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు శ్రీవల్లిని ఢీకొట్టింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అంగన్వాడీ కేంద్రం వద్ద యూరిన్‌కి వెళ్ళే సమయంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఢీ కొనడంతో చిన్నారి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ వెల్లడించారు.