అమరావతి – ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి.. భారత్‌లోనూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలారు యువత.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ జోష్ కనిపించింది. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవర్ 1వ తేదీన.. రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ లిక్కర్ సేల్స్ కొత్త రికార్డు సృష్టించాయి.. అయితే తెలంగాణాలో కేవలం మూడు రోజులలోనే రూ.620 కోట్ల విలువైన మద్యం తాగేశారు.. ఈ రికార్డ్ దరిదాపుల్లో కూడా ఏపీ లేకపోవడం విశేషం.. ఇక డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని ఏపీ అధికారులు చెబుతున్నారు.. ఈ రెండు రోజుల్లో కలిపి ఏకంగా దాదాపు రూ.250 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది.. డిసెంబర్ 31వ రోజున రాష్ట్రవ్యాప్తంగా రూ.147 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుండగా.. జనవరి 1వ తేదీకి వచ్చేసరికి దాదాపు రూ.100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాష్ట్రంలో డిసెంబర్ 31వ తేదీన 1.51 లక్షల కేసుల లిక్కర్, 67 వేల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.. గతేడాది అదేరోజున రూ.142 కోట్ల విలువైన మద్యం అమ్మగా, ఈసారి రూ.5కోట్ల మేర అమ్మకాలు పెరిగిపోయాయి.. ఇక, 2024 జనవరి 1వ తేదీతో పోలీస్తే.. 2023 జనవరి 1న మద్యం అమ్మకాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.. 2023 జనవరి 1న రూ.98 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా.. ఈ ఏడాది అది రూ.100 కోట్ల పై మాటే.. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు.. మద్యం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించడానికి సెలబ్రేషన్స్ తోడుకావడంతో.. సేల్స్ అమాంతం పెరిగాయి.. ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.75 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతుండగా ఈ రెండు రోజుల్లో అది అమాంతం పెరిగిపోయింది.