Monday, November 18, 2024

Big story | బార్లు..బార్లా..! 24గంటల మద్యం అమ్మకాలు, మామూళ్ల మత్తులో అధికారగణం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో బార్ల నిర్వాహకులు విచ్చలవిడి అమ్మకాలకు తెగబడుతున్నారు. అధికారుల కనుసన్నల్లోనే బార్లలో 24గంటల పాటు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కొత్త బార్ల వేలం తర్వాత ఇది మరింత శృతిమించి రాగానపడిందని చెప్పొచ్చు. నిర్థేశిత సమయం మించిన తర్వాత అధిక రేట్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నా..ఎక్సైజు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) ఊసేలేదు. ఎవరైనా అదేమని ప్రశ్నిస్తే..నిజమా? మా దృష్టికి రాలేదే? అంటూ… అమాయకపు చూపులు చూడటం అధికారులకు పరిపాటిగా మారింది. ఒకరిద్దరు అధికారులైతే మరీ కట్టడి చేస్తే బెల్టు షాపులు వస్తాయండీ.. అంటూ బెల్టు షాపుల కట్టడి కోసమే వదిలేస్తున్నామంటూ అతితెలివి సమాధానం చెపుతున్నారు. బార్లలో నిరంతర విక్రయాలకు కొందరు రాజకీయ పార్టీల నేతలు కూడా సహకరిస్తున్నారు. రాష్ట్రంలో దశలవారీ మద్యం నిషేధం అమలు హామీతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు మద్యం అమ్మకాలపై నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఎక్సైజు శాఖలో సమూల మార్పులు చేయడంతో పాటు అక్రమ మద్యం, అనధికార అమ్మకాలను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ)ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అప్పటికే ఉన్న 42వేల బెల్టు షాపులను తొలగించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా ప్రైవేటు ఆధీనంలోని షాపులను ఏపీబీసీఎస్‌ పరిధిలోకి తీసుకొచ్చి..అమ్మకపు వేళలు నియంత్రించడంతో పాటు రేట్లను సవరించింది. ముందస్తు హామీ మేరకు మద్యం షాపుల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించింది. ప్రభుత్వ మద్యం షాపుల తగ్గింపు, అమ్మకపు వేళల నియంత్రణ వంటి ప్రభుత్వ నిర్ణయాలను బార్ల నిర్వహకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తద్వారా యధేచ్చగా అమ్మకాలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి భారీగా గండికొడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో నిరంతరం పని చేయాల్సిన ఎక్సైజు, ఎస్‌ఈబీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినబడుతున్నాయి.

నిబంధనలు బేఖాతర్‌..

- Advertisement -

ప్రభుత్వ నిబంధనలను బార్ల నిర్వాహకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎక్సైజ్‌ చట్టంలో బార్ల నిర్వహణ వేళలు స్పష్టంగా నిర్థేశించారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు బార్లలో మద్యం అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. రాత్రి 10గంటల నుంచి 11గంటల వరకు గంట వ్యవధి ఆహార పదార్థాల కోసం అదనంగా ఇస్తారు. ఇదే మద్యం షాపులైతే ఉదయం 11గంటల నుంచి రాత్రి 9గంటల వరకు, రాత్రి 9గంటల నుంచి రాత్రి 10గంటల వరకు నగదు లావాదేవీలు సరిచూసుకునేందుకు వ్యవధి ఇచ్చారు. మద్యం షాపులతో పోల్చితే బార్లలో 30శాతం వరకు అదనపు రేట్లు వసూలు చేస్తారు. అయితే ఉదయం మద్యం షాపులు తెరిచేందుకు సమయం ఎక్కువగా ఉండటంతో బార్ల నిర్వాహకులు ఈలోగానే పెద్ద ఎత్తున అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పైగా రాత్రి 11గంటల తర్వాత బార్ల షట్టర్లు మూసి వెనుక మార్గాల్లో అమ్మకాలు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్థేశించిన సమయాలతో నిమిత్తం లేకుండా వీరు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతున్నారు.

రాత్రి రేట్లు అదనం..

నిర్థేశిత వేళల తర్వాత జరిపే అమ్మకాలపై అదనపు రేట్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినియోగదారుల నుంచి వినబడుతున్నాయి. వెనుక నుంచి బాహాటంగానే అమ్మకాలు జరుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అదనపు వేళల్లో జరిపే అమ్మకాలతో సిబ్బంది జీతాలు, ఎక్సైజు, పోలీసు తదితర నెలవారీ మామూళ్లు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులే చెపుతున్నారు. సాధారణ సమయాల్లో మద్యం షాపులతో పోల్చితే 30శాతం అదనపు రేట్లు ఉన్నాయి. రాత్రి వేళల్లో..అమ్మకపు వేళలు లేని సమయంలో మరో 30శాతం వసూలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మద్యం వ్యసనపరుల జేబులను బార్ల నిర్వాహకులు గుల్ల చేస్తున్నారని చెప్పొచ్చు.

కొత్త లైసెన్స్‌ల తర్వాతనే..

గత ఏడాది అక్టోబర్‌లో కొత్త బార్లకు ప్రభుత్వం లైసెన్స్‌లు మంజూరు చేసింది. అప్పటి నుంచే గతంలో ఎన్నడూ లేని విధంగా విచ్చలవిడి అమ్మకాలకు నిర్వాహకులు తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలోని 918 మద్యం షాపులకు వేళం విధానంలో అమ్మకాలకు అనుమతులిచ్చారు. బార్ల నిర్వహకులు తెరముందు పేర్లు ఒకటి కాగా తెరవెనుక నిర్వహకులు ఒకరనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ నిర్వహకుల సిండికేట్‌ మాత్రం మారదని చెప్పొచ్చు. ఒక్కొక్క ప్రభుత్వంలో ఒకరు ముందుకొస్తే..మరొకరు వెనుకండి నడుపుతారు తప్ప పెద్దగా మార్పేమీ ఉండదు. ఎటొచ్చి ఈసారి రాజకీయ నేతలు కూడా సిండికేట్‌ భాగస్వాములు కావడంతో ఈ తరహా అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. మద్యం విషయంలో ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం..ఇలాంటి విచ్చలవిడి అమ్మకాలకు చెక్‌పెట్టని పక్షంలో మరింత అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందనేది సాధారణ పౌరుల అభిప్రాయంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement