అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాల పథకాలతోపాటు కేంద్ర పథకాలకు సంబంధించి 2024-25 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ఈ నెల 14లోగా ఆన్‌లైన్‌లో పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. మహిళలు, బాలికలకు ప్రత్యేకంగా జెండర్ బడ్జెట్‌కు ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ఉప ప్రణాళికలను ప్రతిపాదించాల్సిందిగా ఆయా శాఖలను ఆదేశించింది. ప్రధానంగా రహదారులు, గృహాలు, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
వీటితోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ లక్ష్యాలను సాధించేలా మూలధన వ్యయ ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించారు. ఈ ప్రతిపాదనలు తప్పనిసరిగా మిషన్ లక్ష్యాల ఆధారంగా ఉండాలని స్పష్టం చేశారు. మంజూరు చేసిన పనుల వివరాలపైనే బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయని పనుల కోసం ఎటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు చేయరాదని సూచించారు. అలాంటి పనులకు బిల్లులను కూడా అంగీకరించబోమని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లేని పనుల ప్రతిపాదనలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయరాదన్నారు.
అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల సమర్థ వినియోగం ద్వారా ఫలితాలు సాధించేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత పథకాలను సమీక్షించి.. ఆ పథకాలకు చేస్తున్న వ్యయం మేరకు ఫలితాలు, ప్రయోజనాలు పరిశీలించాలని జీవోలో పేర్కొన్నారు. ప్రయోజనం లేని పథకాలను ఆర్థిక శాఖతో సంప్రదించి నిలిపివేయాలన్నారు. ఇలా ఆదా అయిన సొమ్ముతో కొత్త పథకాలను రూపొందించాలన్నారు.
అన్ని శాఖాధిపతుల వేతనాలేతర వస్తువులు, ఇతర వ్యయాలను సమీక్షించి 20 శాతం మేర పొదుపును ప్రతిపాదించాలని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఉప ప్రణాళికలకు ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించాలని, ప్రస్తుత ప్రతిపాదనలను సమీక్షించి, మార్పులు అవసరం ఉంటే చేయాలన్నారు. అన్ని శాఖలు వాస్తవికంగా అంచనాలు వేసి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. తప్పనిసరి వ్యయాలైన సబ్సిడీలు, సామాజిక భద్రత పెన్షన్లు మొదలైన వాటికి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా తగిన నిధులను ప్రతిపాదించాలి.
కన్సల్టెంట్స్, ఔట్‌సోర్సింగ్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు చేయకూడదన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అంచనాలను అత్యంత జాగ్రత్తతో రూపొందించాలనీ పేర్కొన్నారు. అంచనాలు, వాస్తవాల మధ్య భారీ వ్యత్యాసాలను నివారించాలన్నారు. ప్రస్తుత పన్ను రేట్లు ఆధారంగానే రెవెన్యూ రాబడుల అంచనాలను ప్రతిపాదించాలన్నారు.
వీలైనంత మేర ఆదాయ వనరుల ఆర్జనపై శాఖలు దృష్టి పెట్టాలన్నారు. అందుకు అనుగుణంగా ఆదాయ వనరుల అంచనాలను పంపాలన్నారు. సవరించిన అంచనాలు వాస్తవిక దృక్పథంతో ఉండాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 నెలల వ్యయ పురోగతి, మిగిలిన నెలల్లో ఖర్చయ్యే అవకాశం ఆధారంగా సప్లిమెంటరీ గ్రాంట్లు కోసం అదనపు నిధులకు ప్రతిపాదనలు చేయాలని జీవోలో ఎస్.ఎస్.రావత్ ఆదేశించారు.