Friday, November 22, 2024

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమల ప్రభన్యూస్‌ : తిరుమలలో భక్తుల రద్దీకొనసాగుతోది. శ్రీవారి దర్శనం కోసం, నడక, రోడ్డు మార్గాన భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటుండడంతో శ్రీవారి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతున్నది. క్యూ లైన్‌లో గంటల తరబడి వేచివున్న భక్తులకు అన్నపానీయాలు అందకపోవడంతో టీటీడీ వైఖరిపై భక్తులు మండి పడుతున్నారు. ఏడుకొండలు భక్తజన సంద్రమయ్యాయి. వరుస సెలవులు కారణంగా శ్రీవారి దర్శనార్థం పెద్దఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తుండడంతో తిరుమలలో ఎటుచూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్‌లే దర్శనమిస్తున్నాయి. ఇక శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూ లైన్‌లు వెలుపల నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిండి సుమారు రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. ప్రస్తుతం టీటీడీ సర్వదర్శనం భక్తులకు జారి చేసే టైంస్లాట్‌ టోకన్లను రద్దు చేసి నేరుగా భక్తులను దర్శనానికి అనుమతిస్తుండడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటుండడంతో వీరందరు కూడా సర్వదర్శనం గుండానే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉండడంతో సర్వదర్శనం క్యూ లైన్‌ అంతకంతకు పెరిగిపోతున్నది.

దీంతో సర్వదర్శనానికి వెళ్ళేందుకు టిటిడి లేపాక్షి సర్కిల్‌ వద్ద నుంచి భక్తులను క్యూ లైన్‌లోకి అనుమతిస్తుండడంతో ఆ ప్రాంతాలను దాటి క్యూ లైన్‌ షాపింగ్‌ కాంప్లెక్సు వైపు నుంచి పాత అన్నదానం వరకు భక్తులు వేచివున్నారు. ఇక కాలినడకన కూడా ప్రవాహంలా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తమ మొక్కలు చెల్లింపులో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన తిరుమలకు వస్తుండడంతో ప్రస్తుతం కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్య దర్శనాన్ని టీటీడీ రద్దుు చేయడంతో కాలిబాట మార్గాన వస్తున్న భక్తులు సర్వదర్శనం ద్వారానే శ్రీవారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సర్వదర్శనం క్యూ లైన్‌లలోకి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం దాదాపు లక్ష మందికి పైగా భక్తులు కంపార్టుమెంట్లు, క్యూ లైన్‌లలో వేచివుండడంతో సర్వదర్శనం ద్వారా భక్తులు వెంకన్నను దర్శించుకోవాలంటే 20 గంటలకు పైగా వేచి వుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టిటిడి అధికారగణం స్వామివారి దర్శనం క్యూ లైన్‌లలో వేచివున్న భక్తులకు అన్నప్రసాదం విభాగం సిబ్బంది శ్రీవారి సేవకుల సహాయంతో అన్నప్రసాదాలు, తాగునీరు సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement