అమరావతి, ప్రభన్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఈ ఏడాది డిసెంబరు ఆఖరుకు 2.62 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కేవలం ఇళ్ల నిర్మాణం మాత్రమే కాకుండా అన్ని రకాల మౌలిక వసతులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆదిమూలపు చెప్పారు. 430 చదరపు గజాల్లోని ఇళ్లకు సంబంధించి లబ్దిదారుల వాటా రూ.25 వేలకు మాత్రమే పరిమితం చేస్తున్నామని పేర్కొన్నారు. ముందుగా తాగునీరు, సీవరెజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు, మురుగునీరు సదుపాయాలు కల్పించిన తర్వాత లబ్దిదారులకు ఇళ్లను అందిస్తామని తెలిపారు. అప్లోడ్ చేసిన బిల్లులను ప్రతీ నెలా చెల్లింపులు పూర్తి చేస్తామని సురేశ్ వెల్లడించారు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పూర్తైన ఇళ్లను వచ్చే నెలలో లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్ల వద్ద శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు లేవని మంత్రి విమర్శించారు. దశలవారీగా ఒక్కో ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇళ్ల కేటాయింపు. ఒక్కో ప్రాంతంలో దశలవారీగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలకశాఖ మంత్రి సురేష్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..