Tuesday, November 26, 2024

AP : వైసీపీ ప్రభుత్వంలో 17 మెడిక‌ల్ కాలేజీలు .. మంత్రి ర‌జిని

వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి రజిని చెప్పారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీ ప్రారంభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రిలో ఉన్న ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఆగస్టు నుంచి అడ్మిషన్స్ ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు.

రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 28 కాలేజీలను అందుబాటులోకి వస్తాయని.. ప్రతి కాలేజీ కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి కాలేజీలో 150 ఎంబీబీయస్ సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో దీన్ని ఒక చరిత్రగా మంత్రి అభివర్ణించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంద్రప్రదేశ్‌గా మార్చడమే సీఎం జగన్ లక్ష్యమని వివరించారు. ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎంబీబీయస్ సీట్లతో పాటు రాష్ట్రంలో 462 పీజీ సీట్లు కూడా పెరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ కాలేజీ కూడా రాలేదని విమర్శించారు. దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగిందని మంత్రి ఆరోపణలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement