ఆర్ధిక, నిర్వహణ పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం 1,650 కోట్లు సమకూర్చింది. ఆర్‌ఐఎన్‌ఎల్ నిలబెట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం రూ.500 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చిందని, సెప్టెంబర్ 27న 1,440 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చినట్లు ఉక్కు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎస్‌బీఐకి చెందిన ఎస్‌బీఐ క్యాప్స్ ఆర్‌ఐఎన్‌ఎల్ సుస్థిరతపై ఒక నివేదికను సిద్ధం చేస్తోందని పేర్కొంది. వైగాజ్ స్టీల్ (ఆర్‌ఐఎన్‌ఎల్) పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్ధిక శాఖతో చర్చిస్తున్నట్లు తెలిపింది.
వైజాగ్ స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులు. ప్లాంట్ 35,000 కోట్ల అప్పుల్లో ఉంది. ప్లాంట్‌లో ఉన్న మూడు బ్లాస్ట్ ఫర్నీస్‌లో రెంటింటిని 2028 అక్టోబర్ వరకు మూసివేయాలని నిర్ణయించారు. మరో బ్లాస్ ఫర్నీస్ నాలుగు నెలల నుంచి పని చేస్తోంది.
2021 జనవరిలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (సీసీఈఏ) వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం వాటాలు విక్రయించాలని సిఫార్సు చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని భరోసా ఇస్తోంది.