అమరావతి, ఆంధ్రప్రభ: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఏడో తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. ఆదివారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పరీక్షలు నాన్ జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు హాల్ టికెట్లను బోర్డు వెబ్ సైట్ బీఐఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఇవి సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయని వివరించారు. రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని బోర్డు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఆ విషయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. జంబ్లింగ్ విధానంలో కాకుండా ముందున్న విధానంలోనే నిర్వహించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఈ నెల 11వ తేదీ నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్ ఫైనల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు దృష్ట్యా కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. తాజాగా ఆదివారం ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణపై స్పష్టతనిస్తూ ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యార్థులు తాము చదువుకున్న కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు.