రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం పలు రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌ను విడుదల చేసినట్లుగా వెల్లడించింది.
ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 446.49 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌కు రూ.1598.80 కోట్లు విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక పరిపాలన కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత కింద ఆంధ్రప్రదేశ్‌కు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండో విడత గ్రాంట్ రూ.420.99 కోట్లతో పాటుగా, మొదటి విడత గ్రాంట్‌లోని రూ.25.49 కోట్లు కలిపి.. మొత్తం రూ.446.49 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది.