అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియలో 1510 మందికి సీట్లు కేటాయించినట్లు ఏపీఈఎపిసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యామండలి జారీ చేసిన జీవో నెం.179ను అనుసరించి ఏపీఈఈసెట్-2023 లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఈ ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియను నిర్దేశించగా, 1735 మంది ఐచ్ఛికాలను నమోదు చేసుకున్నారన్నారు.
కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే వర్తించేలా ఈ కౌన్సిలింగ్ ను చేపట్టామని పేర్కొన్నారు. తొలి, మలి దశ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్ధులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్ ను సద్వినియోగం చేసుకున్నారని నాగరాణి తెలిపారు. విద్యార్ధుల నుండి భిన్న రూపాలలో వచ్చిన అభ్యర్ధనల ఫలితంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ కు అనుమతి ఇచ్చారని, విద్యా శాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ ప్రత్యేక చొరవ చూపారని నాగరాణి పేర్కొన్నారు.
ప్రత్యేక రౌండ్ లో చేసిన ప్రవేశాలకు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అన్ని రకాల ప్రభుత్వ పధకాలకు అనుమతి ఉందని కన్వీనర్ వివరించారు. సీట్లు- కేటాయించిన కళాశాలలో నవంబరు 14వ తేదీ లోపు విద్యార్ధులు వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉందని ఎపిఈఎపిసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.