Saturday, November 23, 2024

12వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 12వ వసంతంలోకి అడుగు పెట్టింది. వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణానంతరం పలు సంఘటనల నేపథ్యంలో.. ఆయన ఆశయాల సాధనే ధ్యేయంగా 2011 మార్చి 12వ తేదీన వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

నాడు ఓదార్పు యాత్రను ఆపేయాల్సిందేనని కాంగ్రెస్‌ అధిష్టానం తెగేసి చెప్పడంతో.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నైతిక విలువలకు కట్టుబడి కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ నుంచి సంక్రమించిన కడప ఎంపీ పదవికి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్‌ జగన్, వైఎస్‌ విజయమ్మలు రాజీనామా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ఉద్యమబాట పట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే.. వైఎస్సార్‌సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో 67 ఎమ్మెల్యే, 7 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేశారు. అనంతరం 2017లో వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రతో చరిత్ర సృష్టించారు. ఆయన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల్లో వైఎస్‌ జగన్‌కు.. వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరిగింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి 151 సీట్లు గెలుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైంది.

సాధారణ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అఖండ విజయం సాధించింది. 2019 మే 30న వైఎస్ జగన్ అధికారం చేపట్టారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసి.. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపారు. గిరిజన మహిళను డిప్యూటీ సీఎంగా.. ఎస్సీ మహిళను హోంమంత్రిగా నియమించారు. నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ.. మహిళలకు రిజర్వేషన్‌ కల్పించారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలల్లో చరగని ముద్ర వేసుకుంటున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement