Tuesday, November 26, 2024

AP | గుంటూరు రైల్వే జంక్షన్‌కు మహర్దశ.. ఆధునీకరణకు 125.16 కోట్లు మంజూరు

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: గుంటూరు రైల్వే జంక్షన్‌కు మహర్ధశ పట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు మోక్షం లభించింది. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో అతిపెద్ద కూడలిగా గుర్తింపు పొందిన గుంటూరు జంక్షన్‌ యార్డు ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు అనుమతి వచ్చింది. కొన్నేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు కోసం అధికారులు చేస్తున్న కృషి ఫలించింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన గతిశక్తి ప్రాజెక్టు కింద రూ.125.16 కోట్లు మంజూరు చేశారు. సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మరో వారం రోజుల్లో ఇందుకోసం టెండర్లు పిలిచేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రాజెక్టు పనులు పూర్తయితే గుంటూరు స్టేషన్‌ మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశముంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. గతిశక్తి కింద మంజూరైన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. నిధుల కొరత లేనందున పనులు వేగంగా జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తిచేసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గుంటూరు రైల్వే స్టేషన్‌ మీదుగా రోజూ కనీసం 100 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ మొత్తం ఏడు ప్లాట్ఫారాలు ఉన్నాయి.

అయినా పూర్తి స్థాయిలో రైళ్లను నిలపడం ఇబ్బందికరంగా మారింది. రెండు ప్లాట్‌ ఫారాలు మినహా మిగిలిన వాటిలో 24 బోగీలు నిలిపే స్థలం లేదు. పురాతన కాలంనాటి సిగ్నల్‌ వ్యవస్థ కావడంతో త్వరగా రైళ్లను స్టేషన్లోకి అనుమతించేందుకు ఇబ్బందికరంగా తయారైంది. గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా అరండల్‌పేట వైపు కొత్తగా 8వ లైను నిర్మించనున్నారు. ఆధునికీకరణ పనులు పూర్తయితే అన్ని ప్లాట్‌ ఫారాల మీద 24 బోగీలు నిలిపే సౌకర్యం రానుంది. దీనివల్ల అదనంగా ఎక్సెస్ర్‌ రైళ్లు నడిపే వీలుంటుంది.

- Advertisement -

కంప్యూటర్‌ ద్వారా సిగ్నల్స్‌ అందుతాయి. రైళ్ల రాకపోకల్లో సమయం ఆదా అవుతుంది. ఖాళీగా ఉండే రైళ్లను నిలిపేందుకు అదనంగా రెండింటిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం లేనందున నల్లపాడు, సిరిపురం స్టేషన్లలో వాటిని నిలిపి ఉంచుతున్నారు. అదేవిధంగా స్టేషన్లోని ప్రధాన మార్గం నుంచి లూప్‌లైన్‌ వరకు పాయింట్స్‌, క్రాసింగ్స్‌ మార్చనున్నారు. గుంటూరు నుంచి కేసీకెనాల్‌ వైపు, తెనాలి మార్గం వైపు వెళ్లే రైళ్లు రెండు లైన్ల నుంచి ఒకేసారి వెళ్లే సదుపాయం కలగనుంది. ఈ పనులన్నింటిని వీలైనంత తొందరగా పూర్తిచేసేందుకు రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement