Friday, September 13, 2024

AP: గంజాయి నిర్మూలనకు వంద రోజుల ప్రణాళిక.. ఏపీ డీజీపీ

త్వరలో యాంటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
అవగాహన కల్పించడానికి ప్రాధాన్యత
రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికాబద్ధమైన కృషి చేయనున్నట్టు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. తిరుపతిలోని పోలీస్ అతిధి గృహంలో ఆయన ఇవాళ రాయలసీమ జిల్లాల ఎస్పీలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్బంగా ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ… కొంతకాలంగా జిల్లాల్లో ఉన్న సవాళ్లపై చర్చించుకోవడం జరిగిందన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన కొన్ని వనరులు, కొత్త వాహనాలు సమకూర్చడం చేస్తామన్నారు. తగిన సిబ్బంది నియామకంపై కూడా త్వరలో దృష్టి సారిస్తామని చెప్పారు. చిన్న చిన్న సర్వీస్ మేటర్సు విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి సరి చేసుకుంటామని, సంక్షేమ విషయం సిబ్బందికి బాగా చేయాలి అనుకుంటున్నామని చెప్పారు.

క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీస్ బాగా చేయాలని కోరుకుంటున్నామని అంటూ .. పోలీస్ సిబ్బందితో పాటు ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలన్నారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రస్తుతం గంజాయి మీద వంద రోజుల ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా యాంటీ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అమాయక గిరిజనులను వాడుకుని గంజాయి సాగు చేయిస్తున్నారని, దానిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే అరికడతామన్నారు. గంజాయి రవాణా నిరోధానికి టెక్నాలజీని ఉపయోగించుకొని గంజా పంటను గుర్తించి నిర్మూలిస్తామని, చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అదేవిధంగా అందరి సమన్వయంతో గంజాయి మాదకద్రవ్యాలపై ప్రజలకు, చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సి వుందన్నారు. వీటితో పాటు మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతామని కూడా తెలిపారు. కొత్త చట్టాలపై పోలీసులకు అవగాహన కలిపించడంతో పాటు నేర పరిశోధనపై మరింత అవగాహనా పెంచడానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెముషి బాజ్ పాయి, వివిధ జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు వి.హర్షవర్ధన్ రాజు (తిరుపతి), కృష్ణారావు (అన్నమయ్య), కృష్ణ కాంత్ (కర్నూలు), సిద్ధార్థ కౌశల్ (కడప), మాధవరెడ్డి (సత్యసాయి), చి మణికంఠ చందోలు (చిత్తూరు) శ్రీ గౌతమి శాలి (అనంతపురం), హాజరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement