Tuesday, November 26, 2024

10 వేల కోట్ల ఆమ్దాని.. సరుకు రవాణాతో రైల్వేకు రికార్డ్‌ ఆదాయం…

అమరావతి, ఆంధ్రప్రభ: కోవిడ్‌- 19 మహమ్మారితో ఎదురైన అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో గొప్ప మైలు రాయిని అధిగమించింది. జోన్‌ పరిధిలో 2021- 22 సంవత్సరంలో(2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి 17వ తేదీ వరకు) సరుకు రవాణాలో 112.51 మిలియన్‌ టన్నుల(ఎమ్‌టీ-) లోడింగ్‌ నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో రూ. 10 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరుకుల లోడింగ్‌ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. సరుకు రవాణా విషయంలో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది, అధికారులు రైళ్ల రాకపోలను నిరంతరం పర్యవేక్షిస్తూండడంతో గత ఆర్థిక సంవత్సరం 2020- 21తో పోలిస్తే 17.7 శాతం అధిక ఆదాయాన్ని, అలాగే 17.3 శాతం అధిక లోడింగ్‌ను సాధించింది.

అధిక భాగం బొగ్గు, సిమెంట్‌దే..

సరుకు రవాణా లోడింగ్‌ పురోగతిలో అత్యధికంగా బొగ్గు, సిమెంట్‌ ఉన్నాయి. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు 53.78 ఎమ్‌టీ-ల లోడింగ్‌తో, సిమెంట్‌ 32.339 ఎమ్‌టీ-ల లోడింగ్‌తో, ఆహార ధాన్యాలు 7.980 ఎమ్‌టీ-ల లోడింగ్‌తో, ఎరువులు 5.925 ఎమ్‌టీల లోడింగ్‌తో, కం-టె-నర్ల సేవలు 2.137 ఎమ్‌టీ-ల లోడింగ్‌తో, స్టీల్‌ ప్లాంట్ల కోసం ముడి సరుకు 4.14 ఎమ్‌టీ-ల లోడింగ్‌తో అల్మూనియా పౌడర్‌, ్లఫయాష్‌, గ్రానైట్‌, చెక్కర మొదలైనవి 5.80 ఎమ్‌టీ-ల లోడింగ్‌తో రవాణా జరిగాయి. సరుకు రవాణాలో వివిధ వినూత్న పథకాలు తీసుకు రావడం, పలు స్టేషన్ల మార్గాలలో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టడం, నిర్వహణకు సంబంధించి అనేక సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి చర్యలు తీసుకోవడంతో ఈ పురోగతి సాధ్యమైంది.
దీనికి అదనంగా, డివిజినల్‌, జోనల్‌ స్థాయిలలో నూతనంగా ఏర్పాటు- చేసిన బిజినెస్‌ డెవప్‌మెంట్‌ యూనిట్లు-(బీడీయూ) జోనల్‌ సరుకు రవాణాలో అభివృద్ధికి దోహదపడింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిశోర్‌ సరుకు రవాణా రంగంలో మెరుగైన రికార్డులను నమోదు చేయడం, మైలురాయి అయిన రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంలో కృషి చేసిన రైల్వే బృందాన్ని అభినందించారు. జోన్‌ సరుకు రవాణా, లోడింగ్‌లో, ఆదాయంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇదే కృషి ఇకమీదట కూడా కొనసాగించాలని ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement