అమరావతి, ఆంధ్రప్రభ: మార్కెట్ పోటీని తట్టుకుంటూ ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఆన్‌లైన్ పాసింజర్ రిజర్వేషన్ విధానం(ఓపీఆర్ ఎస్)లో ఆర్టీసీ పోర్టల్, యాప్ ద్వారా తిరుగు ప్రయాణం(రిటర్న్ జర్నీ) టిక్కెట్లు బుక్ చేసుకున్న ఏసీ బస్సు ప్రయాణికులతో పాటు నాన్ ఏసీ ప్రయాణికులకు కూడా 10శాతం రాయితీ ఇవ్వనుంది. శుక్రవారం నుంచి అమలులోకి రానున్న ఈ రాయితీ వచ్చే ఏడాది ఏప్రిల్ 20వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ప్రయోగాత్మకంగా ఆరు నెలలకు పరిమితం చేసిన డిస్కౌంట్ ఆఫర్ ప్రయాణికుల ఆదరణను బట్టి పొడిగింపుపై పునరాలోచన చేస్తామని ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.
ప్రైవేటు ఆపరేటర్ల పోటీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఇటీవల పలు ఆకర్షణీయమైన పథకాలు అమలులోకి తెస్తోంది. ఇందులో భాగంగా అదనపు ఛార్జీలు లేకుండానే దసరా స్పెషల్స్ నిర్వహించి విజయవంతమైంది. ఇదే క్రమంలో వచ్చే కార్తీక మాసంలో పంచారామాలకు సైతం ఏ విధమైన అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడపబోతోంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో రాయితీ సౌకర్యం కలిపించబోతోంది. ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో తిరుగు ప్రయాణం టిక్కెట్ల రిజర్వేషన్లపై 10శాతం, నలుగురు సభ్యుల(పిల్లలు సహా) గ్రూప్ బుకింగ్‌పై 5శాతం, ఏపీఎస్ ఆర్టీసీ ఈ-వాలెట్ ద్వారా చెల్లింపులపై 5శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఐటీ విభాగం ఇప్పటికే టిక్కెట్ బుకింగ్ పోర్టల్, యాప్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విధానానికి ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి పొడిగింపు నిర్ణయం ఉంటుందని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.