స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాఠశాలల్లో విద్యా కమిటీ ఛైర్మన్లతో జెండా వందనం చేయించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ తప్పుబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలతోనే జెండాను ఎగురవేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను నిర్వీర్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం జీవోలను జారీ చేస్తోందని మండిపడ్డారు. ఈ జీవోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే హక్కు, అధికారాలను రాజ్యాంగం.. సర్పంచ్, ఎంపీటీసీలకు కల్పించిందని గుర్తు చేశారు. ఆ నిబంధనలను పక్కన పెట్టి… విద్యా కమిటీ ఛైర్మన్లతో జెండా ఎగురవేయించాలని ఆదేశాలను జారీ చేయడం దారుణమని అన్నారు. సర్పంచ్ లకు వ్యతిరేకంగా నిధులు, విధులు, అధికారాలు తదితర అంశాల్లో చట్ట వ్యతిరేక జీవోలను జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత జీవోలు అమలైతే.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతారన్నారు. ప్రభుత్వం స్పందించి జీవోలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వార్త కూడా చదవండిః సీఐపై ఎస్పీకి మహిళ ఫిర్యాదు