నల్లగొండ : గంజాయి ఆపరేషన్ విషయంలో అసలేం జరిగింది. పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంది..? అసలు వాస్తవాలేమిటి అనే అంశాలను డీఐజీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. వై.ఎస్.ఆర్. సిపి ఎంపీ విజయసాయి రెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా పోలీస్ అధికారి పేరుతో చేసిన ప్రకటనలు పరోక్షంగా తనను ఉద్దేశించి చేసినవిగా భావిస్తూ జరిగిన వాస్తవాలను తెలియజేస్తూ నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు..
గంజాయి సమస్య ఏ.వో.బి.లో కొత్తగా ఉత్పన్నం కాలేదని.. పదిహేను సంవత్సరాల నుండి ఈ సమస్య ఉన్న విషయం సీనియర్ పోలీస్ అధికారులందరికి తెలుసని రంగనాధ్ తెలిపారు. వై.ఎస్.ఆర్. సిపి ఎంపీ విజయ సాయి రెడ్డి తనపై చేసిన పలు ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి తాను దగ్గరగా ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాకుండా తాను చెప్పడం వల్లనే కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులు గంజాయి కోసం ఏ.వో.బి. ప్రాంతంలో దాడులు చేస్తున్నారని చెస్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల కోసం నిరంతరం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న దేశంలోని పలు రాష్ట్రాల, పోలీసులకు దురుద్దేశాన్ని అపాదిస్తూ, వారిని తక్కువ చేయడం సరికాదని ఎస్‌పీ రంగనాథ్ అన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుని హోదాలో ఉన్న విజయసాయి రెడ్డి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, తప్పుడు సమాచారం కారణంగానో తనపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని రంగనాథ్ చెప్పారు.
అసలు నిజం ఏమిటి…
ఏ.వో.బి. ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న సమస్య ఇప్పటిది కాదని, ముఖ్యంగా ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని విశాఖపట్నం రూరల్, తూర్పు గోదావరి, మల్కన్ గిరి జిల్లాల అటవీ ప్రాంతంలో 15 సంవత్సరాలుగా వేల ఎకరాలలో అక్కడి గిరిజనులు గంజాయి సాగు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. కరోనా (కొవిడ్) తర్వాత గంజాయి వినియోగం దేశ వ్యాప్తంగా, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిందన్నారు. దీనికి ప్రధాన కారణం లాక్ డౌన్ సమయంలో అనేక మంది గంజాయి వాడకందారులు దేశంలోని ప్రధాన నగరాల నుండి గ్రామీణ ప్రాంతాలకు తరలి, సొంత గ్రామాలకు రావడంతో గంజాయి సేవించే అలవాటును గ్రామీణ యువతకు, ప్రజలకు అంటించారని తెలిపారు.
కొవిడ్ కారణంగా దేశ వ్యాప్తంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారని ఎస్‌పీ రంగనాథ్ అన్నారు. వారిలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన యువత గంజాయి రవాణాను ఉపాధి మార్గంగా ఎంచుకున్నట్టు తెలిపారు. డబ్బులు సంపాదించడం గంజాయి పెద్ద ఎత్తున రవాణా కావడానికి మరో ప్రధాన కారణమని వివరించారు. ఈ క్రమంలోనే ఏ.వో.బి. ప్రాంతం నుండి గంజాయి రవాణా తెలంగాణలోనికే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. దీని కారణంగానే దేశ వ్యాప్తంగా కోట్లాది మంది యువత గంజాయికి బానిసలుగా మారి ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం కావడమే కాక దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడిందని, గంజాయి కారణంగా అసాంఘిక కార్యకలాపాలు, నేరాల సంఖ్య పెరిగిపోతున్నదని చెప్పారు.