Japan Sleep Contest | జపాన్ లో వింత ‘నిద్ర పోటీ’ .. గెలిస్తే రూ.12 లక్షల ప్రైజ్‌మనీ

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: సాధారణంగా త్వరగా నిద్రపోవడం అంటే ఆ రోజు పూర్తయిందని, విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని అర్థం. కానీ జపాన్‌లో ఇటీవల నిద్రపోవడం అనేది ఒక పెద్ద పోటీగా మారింది. అత్యంత వేగంగా, గాఢంగా నిద్రపోయిన విజేతకు ఏకంగా 2 మిలియన్ యెన్లు (సుమారు రూ. 12 లక్షలు) కంటే ఎక్కువ విలువైన బహుమతిని ప్రకటించడంతో చాలా మంది ఈ వినూత్న సవాలును స్వీకరించడానికి పోటీ పడ్డారు. టోక్యో వేదికగా జరిగిన ఈ అసాధారణ పోటీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..

‘మ్యాట్ రేస్’ పోటీ..

ప్రసిద్ధ మ్యాట్రెస్ తయారీ సంస్థ కోలా స్లీప్ జపాన్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనికి ‘మ్యాట్ రేస్’ అని పేరు పెట్టారు. మసక వెలుతురు ఉన్న ఒక పెద్ద గదిలో పోటీదారులకు సౌకర్యవంతమైన పరుపులను ఏర్పాటు చేశారు. పడుకోవడానికి వారికి గరిష్టంగా 90 నిమిషాల సమయం కేటాయించారు.

కేవలం త్వరగా కళ్ళు మూసుకోవడం మాత్రమే కాకుండా, ఎంత త్వరగా, ఎంత గాఢమైన నిద్రలోకి జారుకున్నారనే దాని ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. నిద్ర నాణ్యతను కొలవడానికి పోటీదారుల తలలకు ప్రత్యేక స్లీప్-ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. పోటీలో గెలవడం కోసం, త్వరగా నిద్రపోవడానికి కొంతమంది అభ్యర్థులు తమకు ఇష్టమైన మెత్తటి బొమ్మలను కూడా మంచం మీదకు తెచ్చుకోవడం విశేషం.

నిద్రకు ముందు కూడా పరీక్షే..

పోటీ ప్రారంభానికి ముందు పాల్గొనేవారితో కొన్ని ప్రత్యేక ప్రీ-స్లీప్‌ వ్యాయామాలు చేయిస్తారు. అంతేకాదు.. ప్రతి పోటీదారుడికి యాదృచ్ఛికంగా ఓ ‘స్లీప్‌ ఐటెమ్‌’ ఇస్తారు. అది వారి నిద్రపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అనుకోకుండా వచ్చే చిన్నపాటి ఆటంకాల మధ్య కూడా ఎవరు తమ నిద్రను కొనసాగించగలరో పరీక్షించనున్నారు.

త్వరగా నిద్రపోయేందుకు కొందరు కావాలనే ముందురోజు రాత్రి నిద్రపోకుండా ఉండే అవకాశం లేకుండా నిర్వాహకులు కఠిన నిబంధనలు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా నిద్రను తగ్గించుకోవడం, నిద్ర మాత్రలు లేదా ఇతర మందులు ఉపయోగించి నిద్రపోవడం నిషేధం.

పోటీ సమయంలో సేకరించిన నిద్రకు సంబంధించిన డేటాను వైద్య సిబ్బంది పరిశీలించి విజేతను నిర్ణయిస్తారు. నిద్ర లోతుకు ప్రత్యేకంగా ‘Deep Sleep Dive Award’, వింత భంగిమల్లో నిద్రపోయిన వారికి ‘Sleep-Turning Acrobat Award’ వంటి ప్రత్యేక పురస్కారాలు కూడా ఇవ్వనున్నారు.

45 వేల మంది పోటీ..

ఈ వింత పోటీపై ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో దరఖాస్తుల సంఖ్యే చెబుతోంది. నిర్వాహకుల ప్రకారం, దరఖాస్తులు ప్రారంభించిన రెండు వారాల్లోనే 45,000కుపైగా ఎంట్రీలు వచ్చాయి. అందులో నుంచి ఎంపికయ్యే అవకాశం 760 మందిలో ఒకరికి మాత్రమే ఉన్నంత స్థాయిలో పోటీ నెలకొంది. చివరకు ఎంపికైన పోటీదారులు టోక్యోలోని ఒక వేదికపై వరుసగా ఏర్పాటు చేసిన మ్యాట్రెస్‌లపై పడుకుని పోటీ పడ్డారు. ఒకే ప్రదేశంలో పలువురు నిద్రపోతుండటంతో అక్కడి దృశ్యం కూడా ఆసక్తికరంగా మారింది.

విజేతకు రూ.12–13 లక్షలు.. అదనంగా మ్యాట్రెస్‌

మొత్తం పోటీలో అత్యధిక స్లీప్‌ స్కోర్‌ సాధించిన విజేతకు 222 లక్షల యెన్‌ల నగదు బహుమతితో పాటు కోఆలా మ్యాట్రెస్‌ కూడా అందించారు. ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి మరికొన్ని అవార్డులు కూడా ప్రకటించారు. వాటిలో ‘డీప్‌ స్లీప్‌ డైవ్‌ అవార్డు’, అలాగే సాధారణ నిద్ర భంగిమలకు భిన్నంగా వినూత్నంగా నిద్రించిన వారికి ‘స్లీప్‌-టర్నింగ్‌ అక్రోబాట్‌ అవార్డు’ వంటి ప్రత్యేక పురస్కారాలు ఉన్నాయి. ‘సుయిమీ’ అనే మారుపేరుతో పరిచయమైన విజేత ఈ పోటీలో విజేతగా గెలిచాడు.

అసలు ఎందుకు ఈ పోటీ..

ఈ పోటీ వెనుక ఒక తీవ్రమైన సామాజిక సమస్య దాగి ఉంది. జపాన్ తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. ప్రజలలో నిద్ర ప్రాముఖ్యత , విశ్రాంతిపై అవగాహన పెంచడానికే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

“జపాన్‌ను తరచుగా తీవ్ర నిద్రలేమితో బాధపడే దేశంగా వర్ణిస్తారు. కానీ ఇక్కడి ప్రజలు తమ పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. నిద్రను ఒక ఈవెంట్‌గా ప్రదర్శించడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్యకరమైన నిద్ర గురించి మరింత ఆలోచిస్తారని ఆశిస్తున్నాం.” అని పోటీ నిర్వహకులు తెలిపారు.