AP Special TET 2026 | ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (స్పెషల్‌ టెట్‌) నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఈ ప్రత్యేక టెట్‌ ద్వారా అర్హత సాధించేందుకు ఉపాధ్యాయులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు టెట్‌ అర్హతను పూర్తి చేసుకుని తమ వృత్తి ప్రయాణాన్ని మరింత ధైర్యంగా కొనసాగించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుందని లోకేశ్‌ తెలిపారు.

స్పెషల్‌ టెట్‌ ముఖ్య తేదీలు

నోటిఫికేషన్‌ విడుదల: ఆగస్టు 24, 2026
దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 24, 2026 వరకు
పరీక్ష నిర్వహణ: అక్టోబర్‌ 11 నుంచి 21, 2026 వరకు

అర్హత కలిగిన ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు మాక్‌ టెస్టులను సాధన చేయాలని కోరారు. స్పెషల్‌ టెట్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌, మార్గదర్శకాలు cse.ap.gov.in, tet2dsc.apcfss.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉపాధ్యాయులను మరింత బలోపేతం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యా వ్యవస్థకు పునాది వేయడమే లక్ష్యమని లోకేశ్‌ పేర్కొన్నారు.