AP Schools Holiday | తుఫాన్ ఎఫెక్ట్.. ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
- భారీ వర్షాల హెచ్చరికతో కలెక్టర్ల నిర్ణయం..
- దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ వర్షాలు
అమరావతి, ఆంధ్రప్రభ : మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
