నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఆత్మకూర్ అటవీ శాఖలో కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ డీఎఫ్ఓ సాయిబాబా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసును విచారించి మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు.
డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, నల్లమల్ల అటవీ పరిధిలో రహదారుల వద్ద ఉన్న చెక్‌పోస్టుల ద్వారా వసూలు ఆదాయాన్ని రిటైర్డ్ ఏవో చాంద్ బాషా పక్కదారి పట్టించాడని తెలిపారు. అతను తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మకూరు పట్టణ సీఐ రాము ఈ కేసు దర్యాప్తు నిర్వహించారు.
2017 నుండి 2024 జూలై 31 వరకు చాంద్ బాషా లింగాల గట్టు, శిఖరం చెక్‌పోస్టుల వద్ద వసూలు చేసిన డబ్బులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మునుపటి ఆంధ్ర బ్యాంక్)లో జమ చేయాల్సి ఉండగా.. అవి తన స్నేహితులు, బంధువుల సహకారంతో దారి మళ్లించినట్టు డీఎస్పీ తెలిపారు. మొత్తం దుర్వినియోగం అయిన మొత్తం రూ.4,37,65,501 గా గుర్తించారు. ఈ మోసంలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
కమిటీ ఏర్పాటు..
కేసులో ఇంకా ఎంత కాజేశారో కనుగొనడానికి అమరావతి నుంచి ప్రత్యేక కమిటీని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. బ్యాంకు నివేదిక, వార్షిక ఆడిట్ రిపోర్ట్‌ల ఆధారంగా పూర్తి వివరాలు బయటకు వస్తాయని డీఎస్పీ తెలిపారు. విచారణలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, బ్యాంక్ అధికారులు, ఆడిటర్ల నిర్లక్ష్యం ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. నిర్లక్ష్యం కనిపిస్తే సంబంధిత అధికారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజి నాయక్ స్పష్టం చేశారు.