నరసరావుపేట – టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఇప్పటికే రాజంపేట పోలీసులు అరెస్టు చేసి ఆయన్ను జైలుకు తరలించారు. అయితే అక్కడ గుండెనొప్పి డ్రామా తర్వాత ఆస్పత్రికి తరలించిన పోలీసులు తిరిగి జైలుకు తెచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి నరసరావుపేటకు తరలించేందుకు సిద్దమయ్యారు. రాజంపేటలో నమోదైన కేసు తరహాలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. దీంతో నరసరావుపేట పోలీసులు కోర్టు అనుమతితో రాజంపేట జైలు నుంచి పీటీ వారెంట్ పై పోసానిని తరలించేందుకు జైలు వద్దకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం పీటీ వారెంట్ తీసుకొచ్చి రాజంపేట జైల్లో పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకునేందందుకు సిద్దమయ్యారు. ఆయనపై నరసరావుపేటలో 153A,504,67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు
నరసరావుపేట టూ టౌన్ సిఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించేందుకు పోలీసులు వచ్చారు. కానీ అదే సమయంలో అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు కూడా పోసాని కోసం పీటీ వారెంట్లతో వచ్చారు. దీంతో వీరిలో ఎవరికి అప్పగించాలన్న దానిపై జైలు అధికారులు మథన పడ్డారు. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో నర్సరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు.. ఆయనను తీసుకుని పోలీసుల నరసరావుపేటకు బయలుదేరారు.. ఆయనకు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు.. ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు.