AP Politcal News l జోగి రమేష్ ఇంటికి జగన్..

AP Politcal News l జోగి రమేష్ ఇంటికి జగన్..

  • ఉత్కంఠ రేపుతున్న జగన్ విజయవాడ పర్యటన..
  • జోగి రమేష్ నివాసానికి జగన్ జోగి కుటుంబానికి పరామర్శ..
  • రమేష్ ఇంటిపై టీడీపీ దాడిపై నిరసన..
  • పోలీసుల ఆంక్షలు, ట్రాఫిక్ నోటీసులతో రూట్ మార్పు..

AP Politcal News, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జోగి రమేష్ నివాసం పై ఇటీవల టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడ పర్యటన చేపట్టారు. ఉదయం 9 గంటలకు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని అక్కడ జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ భేదాభిప్రాయాలను హింసాత్మకంగా పరిష్కరించడం సరికాదని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా పార్టీ అధినేత జగన్ జోగి రమేష్ ఇంటికి వెళ్లడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.

కఠినంగా పోలీస్ ఆంక్షలు..
జోగి రమేష్ ఇంటికి జగన్ పర్యటనపై విజయవాడ పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూట్ మ్యాప్ మార్చాలని సూచిస్తూ విజయవాడ సి పి రాజశేఖర్ బాబు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ప్రధాన రహదారులపై రాకపోకలు అధికంగా ఉండటంతో వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ నివాసానికి వెళ్లాలని సూచించారు.

పార్టీ వర్గాల రూట్ మ్యాప్ ఐలా..
మాజీమంత్రి జోగి రమేష్ ఇంటికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే రూట్ మ్యాప్ ను జిల్లా పార్టీ ప్రకారం జగన్ విజయవాడకు చేరుకున్న తర్వాత వారధి, కృష్ణలంక ఎం హోటల్, డీసీఎం హోటల్, ఈట్ స్ట్రీట్, రాజీవ్ గాంధీ పార్క్ దుర్గగుడి ఫ్లైఓవర్, భావనిపురం స్వాతి సినిమాహాల్ సెంటర్, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నం మార్గంలో వెళ్తారని ప్రకటించారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పదవుల్లో ఉన్న నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొనాలని కోరారు. ఇప్పటికే జన సమీకరణపై స్థానిక నాయకులు విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు.

మరోవైపు పోలీసుల ఆంక్షలు, ట్రాఫిక్ మార్పుల నేపథ్యంలో విజయవాడలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. జగన్ పర్యటన సందర్భంగా ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోకి ప్రవేశించే మార్గాలు ఇతర ప్రాంతాలలో పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తానికి జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనతో మొదలైన ఈ పరిణామాలు, స్వయంగా జగన్ రంగంలోకి దిగడం, మరోవైపు పోలీసుల ఆంక్షలు విధించడ కలిపి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ పర్యటనతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply