వెలగపూడి – సింహాచలంలో గోడ కూలడం కారణంగా క్యూ లైన్‌లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చందనోత్సవ వేళ ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నానని, భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించానని పవన్ కల్యాణ్ అన్నారు.
జగన్ సంతాపం
ఇక అటు సింహాచలంలో గోడకూలి భక్తులు మృతిచెందడంపై వైసిపి అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ.300 టికెట్ క్యూ లైన్ పై గోడకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం చేశారు . నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు .
తీవ్ర ఆవేదనకు గురిచేసింది: మంత్రి లోకేష్
సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
స్వామివారి దర్శనం కోసం వెళ్లి చనిపోవడం బాధాకరం: పురందేశ్వరి
సింహాచలం దుర్ఘటనపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్న ఏడుగురు భక్తుల మృతి బాధాకరమన్నారు. స్వామివారి చందనోత్సవ సమయాన ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అటు ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.