AP NTR Bharosa Pension | రూ. 2,692.34 కోట్ల నిధులు విడుద‌ల‌… అక్టోబ‌ర్ 1 ఉద‌యం నుంచే పంపిణీ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ భరోసా పింఛనుదారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్‌ 1వ తేదీ ఉదయం నుంచే యథావిధిగా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. గతంలో ప్రకటించిన సమయ మార్పులతో సంబంధం లేకుండా.. ప్రతి నెల మాదిరిగానే ఉదయం 6.30 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

రూ.2,692.34 కోట్లు విడుదల..

అక్టోబర్‌ నెలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్ల నిధులను విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందులో రూ.2,692.28 కోట్లను గ్రామ పంచాయతీలు, వార్డు ఖాతాలకు జమ చేయగా.. రూ.6 లక్షలను గజపతినగరం మండలంలోని ఎన్‌ఎస్‌ఏపీ (NSAP) పింఛనుదారుల ఖాతాలకు డీబీటీ (DBT) ద్వారా జమ చేయనున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్‌ 30 నుంచే ఏర్పాట్లు

బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమించడంతో బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు లేవని మంత్రి తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.సెప్టెంబర్‌ 30వ తేదీనే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది బ్యాంకుల నుంచి పింఛను నగదును ఉపసంహరించుకుని.. మరుసటి రోజు ఉదయం నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తారని వివరించారు.

అధికారులకు మంత్రి ఆదేశాలు

పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ నాటికి అవసరమైన నగదు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారులకు ప్రతి నెలా ఒకటో తేదీనే సకాలంలో పింఛన్లు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.