గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ: .ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంకల్పంతో నియోజకవర్గంకు వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహాయజ్జంను రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మంగళగిరి నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రూ.53 కోట్లతో మంగళగిరి నియోజకవర్గంలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి ఆదివారం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి ఆయన శంఖుస్థాపన చేశారు. ఆసుపత్రి ఫైలాన్‌ను ఆవిష్కరించారు. ఏపీ వైద్య మౌళిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంయస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…. పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అందుకే కూటమి ప్రభుత్వం నియోజకవర్గంకు ఒక వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. వారణాశిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో వారణాశిలో ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్దారని, ప్రధానమంత్రి ఆదర్శంగా ఈ ఆసుపత్రి మోడల్‌ను సిద్ధం చేశామన్నారు.
జీ ప్లస్ వన్ తరహాలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మంగళగిరిలో రూ.53 కోట్లతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో, అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఆర్థో, న్యూరోకేర్, డయాలసిస్, తలసేమియా సెంటర్ తో పాటు డీ–ఆడిక్షన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రాజకీయంగా తనకు గుర్తింపు, గౌరవం అందించిన మంగళగిరికి మరింత మంచి చేయాలనే సంకల్పంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్, అండర్ గ్రౌండ్‌లో పైప్‌ల ద్వారా గ్యాస్ సరఫరా కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంగళగిరిలో త్వరగా పనులు పూర్తి చేసుకుని రావాలని, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశిస్తున్నారని మంత్రి లోకేష్ తెలిపారు.
తాత ఆశీస్సులు ఎప్పుడే వెన్నంటే….
ఆంధ్రుల అభిమాన నాయకుడు, తన తాత నందమూరి తారక రామరావు ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడు రాష్ట్రంపై ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 41 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో 30 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎన్టీయార్ శంఖుస్థాపన చేశారని, మళ్లీ ఇన్నేళ్లకు అదే స్థలంలో 100 పడకల ఆసుపత్రికి తాను శంఖుస్థాపన చేయడం తన అదృష్టమన్నారు.
ఏపీఎంయస్‌ఐడీసీ అధికారులకు అభినందనలు…
ఆసుపత్రి నిర్మాణంకు సంబంధించిన ప్లాన్, డిజైన్లు అద్భుతంగా ఉన్నాయని ఏపీఎంయస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్,ఎండీ గిరీషా, ఇంజనీర్లను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఏడాదిలో ఆసుపత్రి నిర్మాణంను పూర్తి చేయాలని, లేకుంటే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేస్తానని జనసేన నాయకుడు, ఏపీఎంయస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లిని హెచ్చరించారు.
ప్రజాసేవకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి….

పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పీ–4 కార్యక్రమాన్ని ప్రారంభించారని, అందులో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యులు అయి ప్రజాసేవకు ముందుకు రావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దివిస్ ల్యాబ్స్ ఆర్థిక సహకారంతో మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రులు లోకేష్, దుర్గేష్‌లు ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.