AP | మండ‌లిలో మాట‌లు తూటాలు – నారా లోకేష్, బొత్స మ‌ధ్య వాగ్వాదం

వైసీపీ స‌భ్యుల‌ను ఏకిపారేసిన మంత్రి లోకేష్
త‌ప్పుడు అభియోగాలు చేస్తే స‌హించ‌బోమ‌ని ఫైర్
వీసీల‌ను బ‌ల‌వంతంగా రాజీనామా చేయించార‌న్న ఎమ్మెల్సీ కల్యాణి
ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌ని లోకేష్ డిమాండ్
అంద‌రి జాతకాలు తేలుస్తామ‌ని మంత్రి ఆగ్ర‌హం

వెల‌గ‌పూడి , ఆంధ్ర‌ప్ర‌భ : ఏపీ శాసనమండలిలో వాడీ వేడి చర్చ జరగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మంగ‌ళ‌వారం కూటమి, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య రగడ చోటు చేసుకుంది. ఉద్యోగాల కల్పన అంశంపై వైసీపీ.. టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతుండగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి మంత్రి లోకేశ్ వివరణ ఇస్తూ.. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడంలేదన్నారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థలలో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా, మంగళవారం పలు అంశాలపై శాసన మండలిలో ఎన్డీయే కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

బ‌లవంతంగా వీసీల రాజీనామా.. ఇచ్చిప‌డేసిన లోకేష్

గవర్నర్ ప్రసంగం అంశంలో తెలుగు ఇంగ్లీష్‌లో ప్రచురణల మధ్య తేడా ఉందని గందరగోళం నెలకొంది. ప్రజలను ఇబ్బంది పెడుతూ సుపరిపాలన అని చెప్పడం కూటమి ప్రభుత్వానికి ఎంత వరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్యాణి ప్రశ్నించారు. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కల్పించామని స్పష్టంగా గవర్నర్ ప్రసంగంలో ఉందని వైసీపీ ఎమ్మెల్సీ అన్నారు. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉందని.తప్పుంటే మార్చుకుంటామని చెప్పండి అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరారు. ఇదే స‌మ‌యంలో ఇక త‌మ ప్ర‌భుత్వంలో నియ‌మించిన యునివ‌ర్శిటీ వైస్ ఛాన్సల‌ర్ల‌ను బెదిరించి రాజీనామా చేయించార‌ని క‌ల్యాణి స‌భ‌లో ఆరోపించారు.

విద్యుత్ చార్జీలు పెంచ‌లేదు

పవర్ చార్జెస్ పెంచమంటున్నారు.. ఎక్కడ ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జ్ పెంచలేదు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటర్‌ ఇచ్చారు.. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేశారిన ఎమ్మెల్సీ కల్యాణి ఆరోపించగా.. వాలంటీర్లను వైసీపీ వాళ్లే రాజీనామా చెయ్యించారని గుర్తుచేశారు మంత్రి లోకేష్.. వాలంటీర్లకు 10 వేలు పెంచుతాం అన్నారు.. వాలంటీర్లు పాపం పూతరేకుల ఆర్డర్ కూడా పెట్టుకుని వెళ్లి ఓటు వేశారని విమర్శించారు.. ఇక, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే సమయంలో వాలంటర్లను రెన్యువల్ చేయకుండా మోసం చేసింది వైసీపీనే అని మండిపడ్డారు.. ఇలా వైసీపీ వర్సెస్‌ కూటమి ప్రభుత్వంగా శాసనమండలి మారిపోయింది.. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలన్నారు లోకేష్. వాకౌట్ చేయొద్దని.. అన్నింటిపైనా చర్చిద్దామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం కావాలని అంటారు… మళ్ళీ ఇంగ్లీష్‌లో చెప్తే ఇబ్బంది అంటారని మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *