హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజుల నుంచి సిట్ బృందాలు రాజ్ కసిరెడ్డి కోసం వెతుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు పక్కా సమాచారంతో సోమవారం ఆయన్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో కాపు కాసి మరీ సిట్ అధికారులు ఆయన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు
మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు కసిరెడ్డి.. రేపు విచారణకు వస్తానంటూ ఈ మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.
కాగా ,మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరుకావాలంటూ ఏపీ హైకోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారులనుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో గాలించాయి. ఈ క్రమంలో అతడి నివాసానికి నోటీసులు అంటించాయి. అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న రాయదుర్గంలోని ఆసుపత్రితోపాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి.