వెలగపూడి ఆంధ్రప్రభ, ఏపీ రాజధాని అమరావతి రూ.2,047 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అమరావతి రైల్వేలైన్ భూ సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు రైతులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. భూ సేకరణపై అభ్యంతరాలుంటే తెలపాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. భూసేకరణకు అభ్యంతరాలు ఉంటే, జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ధ్రువపత్రాలతో హాజరవ్వాలని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ నోటీసులు జారీ చేశారు.
తెలంగాణాలోని ఎర్రుపాలెం నుంచి రాజధాని ప్రాంతం మీదుగా నంబూరు వరకూ 56 కిలోమీటర్ల మేర నూతన రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అందుకుగాను రూ. 2,545 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో 25 ఎకరాలు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మెుత్తం 864 ఎకరాల భూమి రైల్వేలైన్‌కు అవసరం. రాజధాని రెండో విడతలో భాగంగా భూ సమీకరణ జరిగే అమరావతి, తుళ్లూరు, తాడికొండ మండలాల మీదుగా రైల్వేలైన్ వెళ్తుంది. ఈ ప్రాంతాల్లో భూ సమీకరణకు సంబంధించి గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
అమరావతి, తుళ్లూరు, తాడికొండ,పెదకాకాని తదితర మండలాల్లోని రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో ఇంకా పెగ్ మార్కింగ్ నిర్వహించలేదు. రెవెన్యూ అధికారుల చర్చలు ఓ కొలిక్కి వచ్చిన అనంతరం అక్కడ కూడా పెగ్ మార్కింగ్ను పూర్తి చేయనున్నారు. రైల్వేలైన్ భూ సేకరణకు 2024వ సంవత్సరంలో అభ్యంతరాలు తెలిపిన రైతులు, భూ యజమానులకు ప్రస్తుతం వ్యక్తిగతంగా నోటీసులను పంపించారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని కేసిరెడ్డిపల్లి, ఎర్రుపాలెం, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని గూడెం మాధవరం, పెద్దాపురం, అల్లూరు, జుజ్జూరు, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం. కంచికచర్ల మండలంలోని పరిటాల, గొట్టుముక్కల. ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు, చిలుకూరు.పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో ఎండ్రాయి, కర్లపూడి, వైకుంఠపురం. తుళ్లూరు మండలంలోని మోతడక, వడ్డమాను. తాడికొండ మండలంలోని తాడికొండ, కంతేరు, పెదపరిమి. పెదకాకాని మండలంలోని పెదకాకాని, కొప్పురావూరు గ్రామాల్లో రైల్వే లైనుకు భూమిని సేకరిస్తున్నారు.
అమరావతి రైల్వేలైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో ప్రైవేటు భూములు 741.8 ఎకరాలు, ప్రభుత్వ భూములు 98.2 ఎకరాలు, ఇనాం భూములు 52.01 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏయే మండలాల్లోనైతే భూసేకరణ ఓ కొలిక్క వచ్చిందో, వాటికి సంబంధించి డబ్బులను రైల్వేశాఖ త్వరలోనే డిపాజిట్ చేయనుంది.