AP – బియ్యం దొంగలంతా వైసీపీలోనే … మీరా ప‌వ‌న్ ను విమ‌ర్శించేది… అంబ‌టికి జ‌న‌సేన క్లాసు

వెల‌గ‌పూడి – మాజీ ముఖ్య‌మంత్రి జగన్ పుట్టగానే ఎంపీ గానో ఎమ్మెల్యే గానో పుట్టలేదని.. తండ్రి పదవి అడ్డంపెట్టుకుని అక్రమ ఆస్తుల సంపాదించింది జగన్ అంటూ విరుచుకుపడ్డారు జ‌న‌సేన నేత‌లు. బియ్యం దొంగలంతా వైసీపీలోనే ఉన్నారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ రంగనాధ్ రాజు, పేర్ని నాని బియ్యం దొంగలు కాదా అని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ బియ్యం రవాణాని అరికట్టారన్నారు.

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసిపి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నేటి ఉద‌యం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన నేత బోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ… సత్తెనపల్లి ఇంచార్జి కూడా కానీ అంబటి రాంబాబు నిన్న పవన్‌పై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ పాకిస్థాన్ లాంటిదని.. కూటమి ఇండియా లాంటిదంటూ వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రం చీకటిలో ఉందన్నారు. ‘నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసావ్.. డయా ఫాంవాల్ అంటే ఏంటో తెలియదు నీకు’’ అంటూ అంబటి ప్రశ్నించారు.

కోడి కత్తి, గులాకారాయి, బాబాయి హత్యని అడ్డం పెట్టుకుని అధికారం ..

వైసీపీలాగా ప్రతిసారి ఎన్నికలకు ఒక స్టంట్ చేసే అలవాటు తమకు లేదన్నారు. కోడి కత్తి, గులాకారాయి, బాబాయి హత్యని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చింది జగన్ అంటూ దుయ్యబట్టారు. ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఆస్తులెంత.. లేనప్పుడు ఆస్తులెంత అని నిలదీశారు. గత 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కూడా ఏ రోజు చెప్పలేదని మండిపడ్డారు. అధికారం ఇచ్చిన వారికి సేవ చేయడం మన బాధ్యత అని చెప్పుకొచ్చారు. జగన్ రాష్ట్రానికి, ఆయన నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైసీపీ ప్రారంభించిందని అన్నారు. హౌస్‌కు వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. కోట్లాది మంది రైతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారన్నారు. జగన్ సొంత నియోజకవర్గంలో కూడా రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ నిలిచారని తెలిపారు.

ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. జాగ్రత్త: బొమ్మడి నాయకర్

వైసీపీ నాయకులు మాట్లాడదల్చుకుంటే రాజకీయంగా మాట్లాడాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ అన్నారు. వైసీపీ ఉన్న 5 సంవత్సరాలు ఎన్ని పరిశ్రమలు తెచ్చారని.. ఈ ఆరు నెలల్లోనే లోకేష్ ఎన్ని తెచ్చారు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి విషయంలో తాము ఇచ్చిన హామీలు నిలుపుకుంటామని స్పష్టం చేశారు. అంబటి మీడియా ముఖంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కోట్లాది రూపాయలు పవన్ కల్యాణ్ రైతులు కోసం సొంత డబ్బులు ఇచ్చారని… వైసీపీ ప్రజల సొమ్మును దిగమింగారంటూ వ్యాఖ్యలు చేశారు. సీబీఎన్, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. ‘మీరు సభకు రావాలి సమస్యలపై మాట్లాడాలి. బయట ప్రెస్‌మీట్ పెట్టి ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. వైసీపీ లీడర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నాయకర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *