AP Govt Caveat Petition Supreme Court | సుప్రీం తలుపు తట్టిన వైసీపీ.. కౌంటర్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం!
అమరావతి / న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై న్యాయపోరాటం పీక్ స్టేజ్‌కు చేరింది. కొత్తగా చేపడుతున్న సవరించిన ఓటర్ల జాబితా (సర్) ప్రక్రియ సంపూర్ణంగా ముగియకుండానే, పాత ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
డీలిమిటేషన్ తర్వాతే షెడ్యూల్
ఓటర్ల జాబితా సవరణతో పాటు స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను కూడా పూర్తి చేయాలని వైసీపీ కోరుతోంది. ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. కొత్తగా ఓటర్లుగా నమోదయ్యే అర్హులకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
వైసీపీ పిటిషన్‌పై ప్రభుత్వం కేవియట్..
మరోవైపు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది. ఈ వ్యవహారంపై కోర్టు విచారణ చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరింది. తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ అంశంపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
సుప్రీంకోర్టు నిర్ణయంపైనే ఆసక్తి
ఒకవైపు ఎస్ఐఆర్, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ కోరుతుండగా.. మరోవైపు ప్రభుత్వం కేవియట్ దాఖలు చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దీంతో సుప్రీంకోర్టు ఈ అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల తదుపరి ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
