AP Forest Department | కంకీ ఏనుగుల సంరక్షణపై ఆరా.. గుచ్చిమి కేంద్రం సందర్శన
- గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రం పరిశీలన
- పచ్చదనం పెంపుపై అధికారులకు సూచనలు
పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఏనుగుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రావి, వేప మొక్కలను నాటారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రతి ప్రదేశంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపుతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.అనంతరం ఏనుగుల సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అడవి ఏనుగుల సంచారాన్ని క్షేత్రస్థాయిలో ఎలా పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని ఏనుగుల ట్రాకర్లను అడిగి తెలుసుకున్నారు.
మానవ–వన్యప్రాణి ఘర్షణల నివారణకు చర్యలు
మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను అధికారులు నాగబాబుకు వివరించారు. పార్వతీపురం డీఎఫ్‌వో ఎస్. వెంకటేష్, అటవీ అధికారులు మ్యాప్‌ల ద్వారా ఏనుగుల సంచారం, వాటి కదలికలపై వివరాలు అందించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులు, పర్యవేక్షణలో ఎదురవుతున్న సవాళ్లను అధికారులు వివరించారు. ఏనుగుల సంరక్షణతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న కృషిని నాగబాబు అభినందించారు.

కుంకీ ఏనుగులకు చెరకు, బెల్లం తినిపించిన నాగబాబు
గుచ్చిమి సంరక్షణ కేంద్రంలోని కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులను నాగబాబు పరిశీలించారు. వాటి ఆరోగ్యం, సంరక్షణ విధానం, ఆహారపు అలవాట్ల గురించి మావటిలు, పశువైద్యుడిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం కుంకీ ఏనుగులకు రాగి, స్వీట్ కార్న్, చెరకు, బెల్లం వంటి ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సలహాదారు పి. మల్లికార్జున రావు, ఏపీసీసీఎఫ్ రాహుల్ పాండే, సీసీఎఫ్ బీఎన్‌ఎన్ మూర్తి, విశాఖపట్నం సర్కిల్ సీసీఎఫ్ ఐకేవీ రాజు, పార్వతీపురం మన్యం డీఎఫ్‌వో ఎస్. వెంకటేష్, విజయనగరం డీఎఫ్‌వో సోమసుందరం తదితర అధికారులు పాల్గొన్నారు.

