AP | విద్యా వ్యవస్థలో భారీ మార్పులు చేస్తాం – మంత్రి నారా లోకేష్
అమరావతి: ఏపీలో విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తోన్న మూస పద్ధతులకు స్వస్తి చెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కేజీ టు పీజీ విద్య కరిక్యులమ్ సమూల మార్పులు తెస్తున్నామన్నారు.
జాతీయ విద్యావిధానం లక్ష్యసాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యానైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్లతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఏపీ ప్రభుత్వంతో సింఘానియా గ్రూప్ (రేమండ్స్), ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణతో పాటు జాతీయ విద్యావిధానంతో సమాంతరంగా సాంకేతికత అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా పాఠశాలల నిర్వహణలో మార్పులు తేవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, కొత్త కారిక్యులమ్ తో కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
ఇక నేడు కుదుర్చుకున్న ట్రస్ట్ ఒప్పందం ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో అమలుచేసే ఈ కార్యక్రమం ద్వారా లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరించనున్నారు. విద్యార్థులను ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యవంతంగా తయారు చేయడమే లక్ష్యమని సింఘానియా గ్రూప్ చైర్మన్ తెలిపారు. విద్యార్థులకు మరింత ప్రభావవంతమైన, ఆకర్షణీయమైన అభ్యసన విధానాల్లో బోధన చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు విజయవాడ, వైజాగ్, అమరావతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లో సాంకేతికతను మెరుగుపరచడం, ఆంగ్లంలో విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయడం ద్వారా విద్య నాణ్యతను పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు.