AP | నామినేటెడ్ పోస్ట్ ల‌లో బిసిల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ – ఎపి కేబినెట్ నిర్ణ‌యం

వెల‌గపూడి – ఆంధ్ర‌ప్ర‌భ – నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్ర‌బాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కు ఆమోదం తెలపగా.. పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ కొనసాగింది. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణపై కేబినెట్ ప్రతిపాదన చేసింది. వెల‌గ‌పూడిలో సిఎం క్యాంప్ కార్యాల‌యంలో నేడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ లో ప‌లు నిర్ణ‌యాల‌కు ఆమోద‌ముద్ర వేశారు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలా కొత్తం చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది.

అలాగే, ప్రాజెక్టులు మినహా ఏపీ సీఅర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు ఏపీ కేబినెట్ ప్రతిపాదన చేసింది. దీంతో పాటు టీటీడీలోని పోటులో పని చేసే వర్కర్లను సూపర్ వైజర్లుగా అప్ గ్రేడ్ చేస్తూ మంత్రివర్గంలో చర్చ జరిగింది. వీరిని సీనియర్ అసిస్టెంట్ కేడర్కు పదోన్నతి కల్పించే ప్రతిపాదనలు చేశారు. ఇక, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశ పెట్టే ప్రతిపాదనపై ఏపీ కేబినెట్ చర్చించింది .

ఇక, తిరుపతి జిల్లాలోని చెన్నై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ లో ప్రతిపాదనలు చేసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం, కోట మండలంలోని కొత్తపట్నం గ్రామ పరిధిలో పరిహారం పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, భారత్ లో తయారైన విదేశీ మద్యం, బీర్, ఎఫ్ఎల్ స్పిరిట్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణకు ప్రతిపాదన చేసింది ఏపీ కేబినెట్.

సూక్ష్మ, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా పారిశ్రామిక విధానంలో మార్పులు

ఎమ్‌ఎస్‌ఏఈ పాలసీని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇండస్ట్రీలిస్టులకు అనేక ప్రోత్సహకాలు ఇచ్చారు. అయితే ఈసారి దాంట్లో స్వల్ప మార్పులు చేస్తూ కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి మరిన్ని ప్రోత్సహకాలు అందించే విధంగా కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంతో పాటు.. రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రెండు సార్లు నగుదును రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు పోలవరం నిర్వాసితులకు రిహబిలిటేషన్ చేసే విధంగా కేబినెట్‌లో చర్చించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అక్క‌డి నిర్వాశితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది.

పవన్ కు అస్వస్థత

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అస్వ‌స్థ‌త కార‌ణంగా నేటి కేబినెట్ స‌మావేశానికి దూరంగా ఉన్నారు.. ఇదే విష‌యాన్ని ముందుగానే స‌మాచారాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *