అమరావతి : అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు బడ్జెట్ సమావేశాలకు హాజరైన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అసెంబ్లీ అధికారులు గట్టి ఝలక్ ఇచ్చారు. ఈ రోజు అంటే.. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మాత్రమే చేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు. అంటే తొలి రోజు సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని అసెంబ్లీ ఉన్నతాధికారులు తేల్చి చెప్పాారు.

పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆ క్రమంలో సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని ఈ సందర్భంగా అసెంబ్లీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయని వారు సోదాహరణగా వివరించారు.
అసెంబ్లీ సమావేశాలంటే స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పిలుస్తారని వారు తెలిపారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సెషన్‌కు హజరైన.. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసినవి తాము పరిగణలోకి తీసుకోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అదీకాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజులు సభ్యుడు సమావేశాలకు హజరు కాకపోతే సీటు వేకెంట్ అంటూ డిక్లేర్ చేసే అధికారం స్పీకర్‌కు ఉందని ఈ సందర్భంగా అసెంబ్లీ ఉన్నతాధికారులు గుర్తు చేశారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయించింది. దీంతో జగన్ మెడపై 60 రోజుల సభకు గైర్హాజర్ అనర్హత కత్తి వేలాడుతున్నట్లు అయింది.