AP | ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌ర్వం సిద్ధం

రెండు ప‌ట్ట‌భ‌ద్రులు, ఒక టీచ‌ర్ స్థానానికి పోలింగ్
ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న 6,62,100 గ్రాడ్యుయేట్స్
త‌మ ప్ర‌తినిధిని ఎన్నుకోనున్న‌ 22,493 మంది ఉపాధ్యాయులు
ప‌ట్ట‌భ‌ద్రుల బ‌రిలో 64 మంది, టీచ‌ర్స్ స్థానంలో 10 మంది పోటీ
మూడు స్థానాల‌కు మొత్తం 1116 పోలింగ్ కేంద్రాలు
ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్
మార్చి మూడో తేదిన ఓట్ల లెక్కింపు

వెల‌గ‌పూడి – ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ స్థానాల‌కు రేపు ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ది మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. 123 పోలింగ్ స్టేష‌న్లలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 22,493 మంది ఓట‌ర్లు ఉన్నారు. 13,503 మంది పురుషులు, 8,985 మంది మ‌హిళ‌లు ఉన్నారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గరం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల ప‌రిధిలో ఎన్నిక జ‌రుగుతోంది. యుటీఎఫ్‌ నుంచి కోరెడ్ల విజ‌య‌గౌరి, ఏపీటీఎఫ్‌ తరపున పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ, పీఆర్‌టీయూ నుంచి గాదె శ్రీ‌నివాసుల‌నాయుడు పోటీ చేస్తున్నారు.

ఇక, ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్‌, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘ‌వులు మ‌ధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,14,984 ఓట్లు ఉంటే.. 1,83,347 మంది పురుషులు, 1,31,618 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండ‌ర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో 30 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆల‌పాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ ల‌క్ష్మణ‌రావు మ‌ధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,46,529 ఓట్లు ఉన్నాయి. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ పోలింగ్ ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ ఓట్ల లెక్కింపు మార్చి మూడో తేదిన చేప‌డ‌తారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *