AP | బడ్జెట్‌లో ఏపీకి గుండు సున్నా…

AP | బడ్జెట్‌లో ఏపీకి గుండు సున్నా…

  • ప్రజలను మోసం చేస్తున్న కూటమి
  • చంద్రబాబు, పవన్ సీక్రెట్ ఎజెండాలతోనే ఢిల్లీ పర్యటనలు
  • జై భీమ్ రావ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, హక్కుల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నేత జడ శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్రం ముందు తలవంచి నిలబడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం ఆదుకుంటుందని ప్రజలు ఆశపడ్డారని, కానీ అమరావతికి బీజేపీ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో టీడీపీ, జనసేన పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీదేనని, కానీ చంద్రబాబు, పవన్ ఇద్దరూ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లే విధానాలకు వంతపాడుతున్నారని జడ శ్రవణ్ ఆరోపించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు గుండు సున్నాగా ఉన్నాయని, అయినా కొన్ని పత్రికలు వరాల జల్లు అంటూ రాయడం విడ్డూరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ మద్దతుతోనే నడుస్తోందని, మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని గుర్తు చేశారు. అయినా చంద్రబాబు, పవన్ కేంద్రానికి కాళ్లు మొక్కుతూ తిరుగుతున్నారని విమర్శించారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్లి ఏం సాధిస్తున్నారని ప్రశ్నించారు.

177 కేటగిరీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క దానికి కూడా నిధులు కేటాయించలేదని, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్ట్ వంటి కీలక రంగాలకు కూడా గుండు సున్నానే ఇచ్చారని ఆరోపించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ బడ్జెట్‌లో కేటాయించిన రూ.3320 కోట్లు గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా తక్కువని తెలిపారు. అమరావతికి మొత్తం రూ.2066 కోట్లు సాయం అంటున్నారని, అందులో వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.432 కోట్లు రుణమేనని, అప్పును కూడా గ్రాంట్‌లా చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో రాజ్ భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ వంటి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నా కాపాడేందుకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని, దేశవ్యాప్తంగా ఐఐటీ సంస్థలకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐఐటీలకు మాత్రం నిధులు ఇవ్వలేదని విమర్శించారు. గూగుల్‌కు పన్ను రాయితీలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం లాభమని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఢిల్లీ పర్యటనలు ప్రజల కోసం కాకుండా సీక్రెట్ ఎజెండాలతోనే జరుగుతున్నాయని, ప్రజల హక్కుల కోసం మాత్రం కేంద్రాన్ని ఏం అడగడం లేదని ఆరోపించారు.

అంబటి ఇంటిపై దాడి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే…

అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులపై కూడా జడ శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వ ప్రోత్సహిస్తున్న రౌడీయిజమని ఆరోపించారు. ప్లెక్సీలు తీయమంటే కత్తులు, కర్రలతో వెళ్లడం ఏ రాజ్యాంగ పాలన అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా అని ప్రశ్నించారు. ఈ దాడిని ఖండిస్తున్నామని, ఆ సమయంలో అంబటి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఉంటే ప్రాణాపాయం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడుల పరిణామాలు 2029లో చంద్రబాబు, పవన్ అనుభవించక తప్పదని హెచ్చరిస్తూ, ప్రజల ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుందని జడ శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాటం ఆగదని, రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు.

Leave a Reply