AP | ఎస్‌హెచ్‌జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి..

AP | ఎస్‌హెచ్‌జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి..
- ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్న కేశినేని ఫౌండేషన్
- హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో 5 రోజుల శిక్షణకు 50 మంది మహిళల బృందం..
- బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
AP | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మహిళల సాధికారత, ఆర్థిక స్వాలంబన లక్ష్యంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. కేశినేని ఫౌండేషన్, హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి 50 మంది ఎస్‌హెచ్‌జి మహిళలు హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాలయంలో ఐదు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. ఈ శిక్షణలో జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ తయారీ, హెర్బల్ ఉత్పత్తుల తయారీ విధానాలపై మహిళలకు ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించనున్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటి నుంచి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే కేశినేని ఫౌండేషన్ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధి అని పేర్కొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కేశినేని ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ అక్కల గాంధీ, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ, అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
