ఎం ఎస్ ఎం పరిశ్రమలను బలోపేతం చేస్తాం..

ఎం ఎస్ ఎం పరిశ్రమలను బలోపేతం చేస్తాం..

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎం ఎస్ ఎం ఈ అసోసియేషన్ ఎక్సపో ప్రారంభం
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తో కలిసి ఎక్స్ పో ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ లబ్బిపేట ఎస్ ఎస్ కవంక్షన్ హాల్ లో ఏపీ ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎం ఎస్ ఎం ఈ ఎక్స్ పో – 2026 ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్థానిక ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు కలసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఎక్సపోలో ఏర్పాటుచేసిన సుమారు 100కు పైగా వివిధ పరిశ్రమలకు చెందిన స్టాల్స్ ను, ఆయా పరిశ్రమల ఉత్పత్తులను ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు.

మూడు రోజులపాటు నగరంలో జరగనున్న ఎం ఎస్ ఎం ఈ ఎక్స్ పో ప్రారంభ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ…. హైదరాబాద్ వంటి ప్రాంతంలో ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమలు త్వరితగతిన వృద్ధి చెందుతాయని, రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయి అంటే దానికి ఆంధ్రప్రదేశ్ ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృషి, చిన్న వ్యాపారుల సంకల్పం ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలని సంకల్పంతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారన్నారు. ప్రభుత్వ సంకల్పం ఆచరణలో నిజం కావాలంటే ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమల అభివృద్ధితోనే సాధ్యపడుతుందన్నారు.

ఎం ఎస్ ఎం ఇ పరిశ్రమల స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని, ప్రభుత్వం సంకల్పించిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ఆచరణలో జరుగుతుందన్నారు. ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమల అభివృద్ధికి , స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందిస్తుందని, ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమలు వృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడలో ఏర్పాటుచేసిన ఎక్స్పో తరహాలోనే రానున్న కాలంలో జిల్లాలోని జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాలలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్స్పోలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేశీయ పరిశ్రమల ఉత్పత్తులనే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమలు తయారుచేసిన ఉత్పత్తులతో ఎక్స్పో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ…. చంద్రబాబు నోటి వెంట పారిశ్రామిక అభివృద్ధి అనే మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుంది అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం ఉపాధి కల్పన జరగాలంటే ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమలు మరింతగా స్థాపన జరగాలన్నారు. ఎం ఎస్ ఎం ఈ రంగానికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. ఏపీ ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు మాట్లాడుతూ వందకు పైగా స్టాల్స్ ను ఎక్స్పోలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు మలినేని నారాయణ ప్రసాద్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్ పర్సన్ కె .పార్వతమ్మ, ఎం ఎస్ ఎం ఈ అసోసియేషన్ అధ్యక్షులు డి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్ రామచంద్రరావు, కోశాధికారి జే వి ఎస్ ఆర్ కే ప్రసాద్, ఎక్స్పో కమిటీ చైర్మన్ సాంబశివరావు, సభ్యులు టీవీ నాగేశ్వరరావు, ఎం అమర్నాథ్, ఐలా మాజీ అధ్యక్షుడు సుంకర దుర్గాప్రసాద్, టాటా ఐలా సర్వీస్ సొసైటీ జే ఆర్ డి చైర్మన్ టి వినోద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply