AP | డిజిటల్ పాస్‌బుక్‌లతో రైతులకు భరోసా…

AP | డిజిటల్ పాస్‌బుక్‌లతో రైతులకు భరోసా…

సాగునీటి ప్రాజెక్టులతో రాయలసీమ అభివృద్ధి
కలుగొట్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వ్యాఖ్యలు

AP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రైతులకు భరోసా, ఆత్మవిశ్వాసం కల్పించేలా బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కూడిన డిజిటల్ పట్టాదారు పాస్‌బుక్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేయడం సంతోషకరమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. కలుగొట్లలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ రైతుల భూ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని అన్నారు.

రైతులకు మద్దతుగా ప్రభుత్వం…

రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో పత్తి, మిరప రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత…

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు అత్యంత కీలకమని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో చెరువులు నిండిపోయి, వేసవి కాలంలో కూడా జలాశయాల్లో నీరు పుష్కలంగా నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆర్‌డీఎస్ కుడి కాలువను టీడీపీ ప్రభుత్వం మంజూరు చేయగా, గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆలస్యం చేసిందన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు కూడా అదే పరిస్థితికి గురయ్యాయని పేర్కొన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.

గాజులదిన్నె ప్రాజెక్టుకు ప్రాధాన్యత…

గాజులదిన్నె రిజర్వాయర్‌ను అత్యంత కీలక ప్రాజెక్టుగా గుర్తించి క్యాబినెట్ ఆమోదం తెలిపి, రాష్ట్రంలోని 19 ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో చేర్చినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

చేనేత రంగానికి ప్రోత్సాహం…

ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ప్రభుత్వం ప్రశంసనీయ చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ పార్క్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి రూ.4 కోట్ల నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ అభివృద్ధి సమస్యలపై వినతి..

కలుగొట్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో దేవుని మాన్యాలు, స్మశానాల కోసం భూములు లేకపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలో స్మశానం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన పట్టాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల విస్తరణలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి తెలిపారు.

Leave a Reply