విద్యుత్ ఉత్పత్తికి మరో ముందడుగు
చిట్యాల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి సర్కిల్ పరిధిలోని చిట్యాల మండలం కైలాపూర్‌లో, పీఎం-కుసుమ్ ‘ఎ’ పథకం కింద టీ. రఘునాథరావుకు చెందిన 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను 33/11 కేవీ చిట్యాల సబ్‌స్టేషన్‌కు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సదానందం సోమవారం విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్థానికంగా విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. పీఎం కుసుమ్ ‘ఎ’ పథకం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతూ, పర్యావరణహితమైన మరియు స్థిరమైన విద్యుత్ ఉత్పత్తికి టీజీఎన్పీడీసీఎల్ ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఈ జగదీష్, ఏడీఈ సుందర్ కుమార్, చిట్యాల ఏఈ చంద్రశేఖర్, మరియు టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
