తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే రెడీ
- జాతీయ రహదారి-563 నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపుగా పూర్తి
- రూ.1641 కోట్ల వ్యయంతో పనులు, సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం
- 68.015 కిలోమీటర్ల పొడవున 4 వరుసలుగా ఆధునిక రహదారిని అభివృద్ధి
- ఈ ప్రాజెక్టులో భాగంగా 9 భారీ వంతెనలు, 23 చిన్న వంతెనలు, 25 అండర్‌వేలు
- వరంగల్-కరీంనగర్ ప్రయాణం సుమారు 45 నిమిషాలకు తగ్గే అవకాశం
- ప్రతి కిలోమీటరుకు కెమెరాల ఏర్పాటుతో పాటు అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : వరంగల్-కరీంనగర్ మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసే ఎన్హెచ్-563 నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.1,641 కోట్ల అంచనా వ్యయంతో 68.015 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారిపై ప్రస్తుతం వాహనాల ట్రయల్రన్ కొనసాగుతోంది. కొత్త రహదారి అందుబాటులోకి వస్తే గతంలో గంటన్నర వరకు పట్టిన వరంగల్-కరీంనగర్ ప్రయాణం సుమారు 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది.
అక్టోబర్ మొదటి వారంలో లేదా దసరాలోపు రహదారిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరో కీలక జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని కీలక నగరాలైన వరంగల్-కరీంనగర్లను అనుసంధానించే జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-563 నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన రహదారిపై వాహనాల ట్రయల్ రన్ కొనసాగుతోంది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు రహదారిపై ఏవైనా లోపాలు, సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారత్మాల ప్రాజెక్టులో భాగంగా వరంగల్-కరీంనగర్ మధ్య ఈ జాతీయ రహదారి విస్తరణను చేపట్టారు. సుమారు 68.015 కిలోమీటర్ల పొడవున 4 వరుసలుగా ఆధునిక రహదారిని అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.1,641 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు.
గతంలో ఈ మార్గం 2 వరుసల రహదారిగా ఉండటంతో పాటు పలుచోట్ల గుంతలు, రద్దీ కారణంగా వరంగల్-కరీంనగర్ మధ్య వాహనదారులు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొనేవారు. కొత్త 4 వరుసల రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభం కానుంది. కొత్త రహదారి వల్ల వరంగల్-కరీంనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ఇప్పటివరకు ఈ కరీంనగర్-వరంగల్ నగరాల మధ్య ప్రయాణానికి సుమారు గంటన్నర వరకు సమయం పట్టేది. ఈ కొత్త ఎన్హెచ్-563 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 45 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తయ్యే అవకాశం ఉంది. రహదారిని గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఆధునిక ప్రమాణాలతో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
వరంగల్-కరీంనగర్ మధ్య దూరం కూడా గతంలో ఉన్న సుమారు 72 కిలోమీటర్ల నుంచి 68 కిలోమీటర్లకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 9 భారీ వంతెనలు, 23 చిన్న వంతెనలు, 25 అండర్‌వేలు నిర్మించారు. మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ ప్రాంతాల వద్ద బైపాస్ మార్గాలను అభివృద్ధి చేశారు.
స్థానిక గ్రామాలకు రాకపోకలు సులభతరం చేసేందుకు అవసరమైన అప్రోచ్ రోడ్లపై కూడా అధికారులు దృష్టి సారించారు. అయితే ఎల్కతుర్తి మండలం బావుపేట క్రాస్ వద్ద అండర్‌వే, సర్వీస్ రోడ్డు వంటి కొన్ని సౌకర్యాలపై స్థానికులు అభ్యంతరాలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాలను పరిశీలించి అదనపు సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త ఎన్‌హెచ్-563 హైవేపై ప్రయాణికుల భద్రతకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ నేషనల్ హైవేపై సోలార్ ఆధారిత లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటరుకు కెమెరాల ఏర్పాటుతో పాటు అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్)ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
రహదారిపై ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించేలా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగట్టు వద్ద ఇప్పటికే టోల్ ప్లాజా నిర్మించారు. రహదారి ప్రారంభమైన తర్వాత అక్కడ టోల్ వసూలు చేయనున్నట్లు సమాచారం. ప్లాజా వద్ద 24 గంటల పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రావడంతో పారిశ్రామిక, వాణిజ్య రవాణాకు కూడా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. గ్రానైట్, పౌల్ట్రీ, నిర్మాణ రంగానికి సంబంధించిన సామగ్రి రవాణా వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ హైవేపై ట్రయల్న్ నిర్వహిస్తూ ఎన్హెచ్‌ఐఐ అధికారులు రహదారి పనులను పరిశీలిస్తున్నారు.
అక్టోబర్ మొదటి వారంలో లేదా దసరా లోపు ఈ కొత్త నేషనల్ హైవేను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. పూర్తి అయిన మరికొన్ని జాతీయ రహదారి ప్రాజెక్టులతో కలిపి ఒకే కార్యక్రమంలో జాతికి అంకితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో తొలిదశలో భూసేకరణ, టెండర్ల కారణంగా కొంత జాప్యం జరిగినప్పటికీ.. ఆ తర్వాత పనులు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం ట్రయల్రన్ జరుగుతుండటంతో త్వరలోనే ఈ మార్గం పూర్తిస్థాయిలో వాహనదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక నేషనల్ హైవేలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణాను వేగవంతం చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా రోడ్డు కనెక్టివిటీ అందిస్తున్నాయి. ఇక మరికొన్ని కొత్త హైవేలు నిర్మాణం దశలో ఉండగా.. అందులో ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
దీంతో త్వరలోనే పూర్తి స్థాయిలో దీనిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ హైవేకు ఎన్‌హెచ్ 365 బీజీగా నామకరణం చేశారు. కొంతకాలం క్రితం నుంచి వైరా నుంచి దేవరపల్లి మధ్య వాహనాలను అనుమతించగా.. ఇప్పుడు పెండింగ్ పనులు కూడా పూర్తవ్వడంతో పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతించనున్నారు.
ఇప్పటికే రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తవ్వగా.. ధ్వంసలాపురం సమీపంలో రైల్వే ట్రాక్‌పై రోడ్ ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరిగింది. ఇప్పుడు ఎడమవైపు ఆర్వోబీ నిర్మాణం కూడా పూర్తి కావడంతో రాకపోకలను అనుమతించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ హైవే ఖమ్మం జిల్లాలో 105 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ పనుల కోసం 3 ప్యాకేజీలుగా రూ.2123 కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు. ఈ జాతీయ రహదారిపై 80,100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 56 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం
కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ జాతీయ రహదారి వల్ల హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు జర్నీ భారీగా తగ్గనుంది. దాదాపు 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. తరచుగా హైదరాబాద్ నుంచి వేలాదిమంది విశాఖపట్నం వెళ్తుంటారు. వీరికి వేగవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.
పనులు పూర్తి కావడంతో ఆగస్ట్ 1 నుంచే పూర్తిస్థాయిలో ఈ రహదారిని ప్రారంభించాలని అధికారులు తొలుత భావించారు. కానీ రెండు, మూడు రోజులు ఆలస్యం కానుంది. ఈ హైవేపై అత్యాధునిక టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఓఆర్‌ఆర్ తరహాలో టోల్ వ్యవస్థ ఉంటు-ంది. మీరు హైవేపై ఎంత దూరమైతే ప్రయాణం చేశారో.. అంత దూరానికి మాత్రమే టోల్ వసూలు చేస్తారు.
వాహనం ఎంట్రీ, ఎగ్జిట్ వరకు ఉండే దూరాన్ని బట్టి టోల్ చెల్లించాల్సి ఉంటుది. ఒక ప్రతీ కిలోమీటర్‌కు ఒక సీసీ కెమెరా ఉంటు-ంది. దీంతో హైవేపై భద్రత పటిష్టంగా ఉంటుదని చెప్పవచ్చు. ఇక వందనం, చౌడవరం సమీపంలో భారీ వాహనాల కోసం ట్రక్ లే బైలు ఏర్పాటు చేశారు. సూర్యాపేట వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లి టోల్ గేట్ కూడా గ్రీన్‌ఫీల్డ్ హైవేలోకి ఎంట్రీ అవుతాయి. దేవరపల్లి సమీపంలో ఎగ్జిట్ గేటు ఉంటుంది. అమరావతి నుంచి నాగపూర్ వెళ్లే హైవేతో ఈ జాతీయ రహదారిని అనుసంధానం చేశారు. వందనం-కొదుమూరు వద్ద ఇది అనుసంధానం అవుతుందని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులు చెబుతున్నారు.
